వారసత్వ ఉద్యోగాల కోసం సింగరేణి కార్మికులు జూన్ 15 నుంచి సమ్మెకు సిద్దం అవుతున్నారు. దీని కోసం ఇప్పటికే వారు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యి జూన్ 15 నుంచి సమ్మె మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. మిగిలిన కొన్ని కార్మిక సంఘాలను కూడా కలుపుకొని సంపూర్ణ స్థాయిలో సమ్మె చేస్తామని సి.ఐ.టి.యు.సి అనుబంధ సంఘం ఎస్.సి.ఈ.యు. అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, హెచ్.ఎం.ఎస్. ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ తదితరులు మీడియాకు తెలియజేశారు.
తెలంగాణా ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత సుమారు 3,000 మంది సింగరేణి కార్మికులు దరఖాస్తులు చేసుకొన్నారని, కానీ హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఇప్పుడు వారందరి పరిస్థితి అయోమయంలో పడిందని అన్నారు. కనుక వారసత్వ ఉద్యోగాలు సాధించుకొనే వరకు తమ సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్పారు. ఆర్.జి.1,2,3 బ్లాకులు, శ్రీరాంపూర్, కొత్తగూడెం, బెల్లంపల్లి, ఇల్లందు మొదలైన అన్ని ప్రాంతాలలో కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారని వారు తెలిపారు. ఈ సమ్మెకు గల కారణాలను వివరించి కార్మికులను చైతన్యపరిచేందుకు ఈనెల 27 నుంచి జూన్ 3వరకు వరుసగా సదస్సులు నిర్వహిస్తామని కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్పారు.
గత రెండు దశాబ్దాలుగా వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూస్తున్న సింగరేణి కార్మికులు, తెలంగాణా ప్రభుత్వం దాని కోసం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు చాలా సంతోషించారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకించడంతో అది అమలుకాకుండా నిలిచిపోయింది. దీంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన కార్మికులు ఆగ్రహంతో సమ్మె బాట పట్టారిప్పుడు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ కోర్టు తీర్పులు దాని చేతులు కట్టేయడంతో ఏమీ చేయలేకపోతోంది. కానీ తాము ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలు చేతికి అందినట్లే అంది చివరి నిమిషంలో చేజారిపోవడంతో ఆగ్రహంతో ఉన్న సింగరేణి కార్మికులు దానిని ఎలాగైనా సాధించుకోవాలనే పట్టుదలతో సమ్మెకు సిద్దం అవుతున్నారు.
దీని కోసం సమ్మె జరిగే అవకాశం ఉందని ముందే గ్రహించిన ప్రభుత్వం ఆరు నెలల పాటు సింగరేణిలో సమ్మెలను నిషేధించింది. అయితే అది ఈ సమస్యకు పరిష్కారం కాదని అందరికీ తెలుసు. కనుక ఈ సమస్యకు తెలంగాణా ప్రభుత్వమె పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది.