దేశంలో పశువధపై నిషేధం

కేంద్రప్రభుత్వం ఈరోజు సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. దేశవ్యాప్తంగా పశువధను నిషేధిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశువులు అంటే ఆవులు, ఎద్దులు, బర్రెలు, దూడలు, కోడెలు, ఒంటెలు అని ఆ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. కనుక ఇక నుంచి పశువులను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించవలసి ఉంటుంది. దాని కోసమే క్రయవిక్రయాలు జరుపుకోవడానికి వీలు పడుతుంది. పశువుల క్రయవిక్రయాలు జరిపేవారు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఈ హామీని ఇవ్వవలసి ఉంటుంది. పశువులను పశువధశాలకు లేదా దేవుళ్ళకు బలి ఇవ్వబోమని కొనుగోలుదారుడు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర సరిహద్దులకు 25కిమీ పరిధిలో ఎక్కడా పశువుల మార్కెట్లు ఉండరాదని ఉత్తర్వులలో పేర్కొంది.

కేంద్రప్రభుత్వం పశువధను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, దానిని రాష్ట్రప్రభుత్వాలు కూడా ఆమోదించినప్పుడే అది అమలులోకి వస్తుంది. కానీ అనేక రాష్ట్రాలలో పశుమాంసం తినేవారు అనేకమంది ఉన్నారు కనుక అటువంటి ప్రాంతాలలో పశువధను అమలుచేస్తే ఓటు బ్యాంక్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కనుక చాలా రాష్ట్రాలు దీనిని వ్యతిరేకించవచ్చు.