ఐదు అవార్డులు గెలుచుకొన్న తెలంగాణా పోలీస్ శాఖ

తెలంగాణా పోలీస్ శాఖ 5 ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకొంది. ఫిక్కి (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) స్టార్ పోలీసింగ్ క్రింద 2017 సంవత్సరానికి ప్రకటించిన అవార్డులలో 5 అవార్డులను తెలంగాణా పోలీస్ శాఖా గెలుచుకోవడం విశేషం. సైబర్ క్రైం విభాగంలో ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు,  పాస్ పోర్ట్ వెరిఫికేషన్, ఫింగర్ ప్రింట్, ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని సమర్ధంగా వినియోగించుకొంటునందుకు, హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లను ఆధునీకరించినందుకు తెలంగాణా పోలీస్ శాఖ 5 ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకొంది.

డిల్లీలో నిన్న జరిగిన ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్-2017 అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర పోలీస్ శాఖ తరపున హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ ఎం.మహేందర్ రెడ్డి, అదనపు పోలీస్ కమీషనర్ టి.మురళీకృష్ణ, సూర్యాపేట ఎస్.పి. జె.పరిమళ, ఐజి రమేష్ రెడ్డి హాజరయ్యి ఈ అవార్డులను అందుకొన్నారు.  

తెలంగాణా పోలీస్ శాఖపై ఇటీవల ఏ.ఐ.సి.సి. కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డులు ఆయనకు చెంపదెబ్బ వంటివని చెప్పక తప్పదు.