జైపాల్ రెడ్డి ఏహోదాతో ఆ మాట చెప్పారు?

తెలంగాణాలో తెరాస ధాటిని తట్టుకొంటూ పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు భాజపా నుంచి పోటీ మొదలవడంతో ఆ పార్టీ తన వ్యూహం మార్చుకొని తన బద్ధ శత్రువైన తెదేపాతో పొత్తులకు సిద్దం అయ్యింది. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి సూచన ప్రాయంగా ఆ విషయం ప్రకటించారు. దానికి తెదేపా నుంచి సానుకూల స్పందన వచ్చింది కూడా. ఇదే విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి నిన్న మరోసారి ప్రకటించారు. సాధారణంగా కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా ఏ నిర్ణయాలు తీసుకోరు కనుక వారిరువురూ చేసిన తెదేపాతో పొత్తుల ప్రకటనకు కూడా అధిష్టానం అనుమతి ఉందనే భావించవలసి ఉంటుంది. కానీ నేటికీ ఏపిలో తమ పార్టీ తెదేపాతో పోరాటాలు చేస్తుంటే, ఇక్కడ అదే పార్టీతో పొత్తులు పెట్టుకోవడం ఏమిటని పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “జైపాల్ రెడ్డి ఏ హోదాతో ఈ ప్రకటన చేశారో తెలియదు కానీ ఆయన చేసిన ప్రకటన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని చాటి చెపుతున్నట్లుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలం పుంజుకొని తెరాసను డ్డీకొంటుంటే జైపాల్ రెడ్డి చేసిన ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల గాలి తీసేసినట్లయింది. రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు తెదేపాతో పొత్తులు పెట్టుకోవలసిన అవసరం ఏమిటో నాకు అర్ధం కాదు. పొత్తుల గురించి పార్టీలో అంతర్గతం చర్చించుకోకుండా ఈవిధంగా బహిరంగ వేదికల మీద ప్రకటించడం సరికాదు,” అని అన్నారు.