తెదేపా అంటరానిది కాదు: జైపాల్ రెడ్డి

స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ తెదేపాను స్థాపించారని ఏపి సిఎం చంద్రబాబు నిన్ననే మహానాడు సభలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను అన్ని విధాల నాశనంచేసిందని అనేకసార్లు అన్నారు. నేటికీ అంటూనే ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణాలో పొత్తులు పెట్టుకోవడానికి తెదేపా సిద్దం అవుతుంటే, చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం. కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్రంలో తమ బద్ధ శత్రువైన తెదేపాతో పొత్తులు పెట్టుకోవడానికి తమ నేతలు చేస్తున్న ఆలోచనలకు అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. కనుక చంద్రబాబు నాయుడు, సోనియా, రాహుల్ గాంధీ అనుమతితోనే రాష్ట్ర తెదేపా, కాంగ్రెస్ నేతలు పొత్తుల గురించి మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. కాంగ్రెస్ అధిష్టానం మనసులో మాటనే బహుశః మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి చెపుతున్నట్లున్నారు.  

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెదేపా ఏమీ మాకు అంటరాని పార్టీ కాదు. ఒకప్పటి రాజకీయ పరిస్థితులు శత్రుత్వం ఇప్పుడు లేవు కనుక తెదేపా ఇష్టపడితే దానితో పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేయడానికి మేము సిద్దమే,” అని అన్నారు.

తెరాస, భాజపాల మద్య మొదలైన యుద్ధం గురించి మాట్లాడుతూ, “అది ప్రజలను మభ్యపుచ్చడానికే. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ మద్య రహస్య అవగాహన ఉంది. కేసులకు భయపడే కేసీఆర్ మోడీని చూసి భయపడుతున్నారు. అందుకే అమిత్ షాను విమర్శించిన నోటితోనే ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతున్నారు. భాజపా కూడా అదేవిధంగా వ్యవహరిస్తోంది. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి నేతల మాటలు వాటి ద్వందవైఖరికి అద్దం పడుతున్నాయి. ఏనాటికైనా తెరాస, భాజపాలు చేతులు కలపడం ఖాయం. వాటిని ఎదుర్కొని ఓడించేందుకు తెదేపాతో సహా ఏ పార్టీతోనైనా పోత్తులకు మేము సిద్దం,” అని అన్నారు జైపాల్ రెడ్డి.