భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాకతో తెలంగాణాలో తెరాస-భాజపాల మద్య మొదలైన మాటల యుద్ధం ఆయన వెళ్ళిపోయిన తరువాత ఇంకా తీవ్రరూపం దాల్చడం విశేషం. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాల ధీటుగా బదులిస్తే, కేసీఆర్ కు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చారు. మళ్ళీ వారికి ఈరోజు మంత్రి హరీష్ రావు వారికి ధీటుగా బదులిచ్చారు.
“తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఇంకా మూడేళ్ళు కూడా పూర్తికాలేదు. కానీ ఈ మూడేళ్ళలోనే అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలో “మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్” గా పేరు తెచ్చుకొంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న పనులను చూసి నేర్చుకోవడానికి వస్తుంటే భాజపా నేతల కళ్ళకు అది కనబడటం లేదు. అమిత్ షా పర్యటనతో మా కాళ్ళ క్రింద భూమి కంపించిపోతోందని రాష్ట్ర భాజపా నేతలు నేతలు చెప్పుకొంటున్నారు. కానీ మాకాళ్ళ క్రింద కాదు మీ కాళ్ళ క్రింద భూమే ఎప్పుడో కంపించిపోయింది. గ్రేటర్ ఎన్నికలతో సహా రాష్ట్రంలో ఇంతవరకు జరిగిన ఒక్క ఎన్నికలలోనైనా మీ పార్టీ గెలవగలిగిందా? మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు మాకే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. ఇక ముందు కూడా అదే జరుగుతుంది,” అని హరీష్ రావు అన్నారు.
“నిధుల విడుదల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రతీమాటకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ విషయంలో ఆయన అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు రాష్ట్ర భాజపా నేతలు సమాధానం చెప్పలేక మా ప్రభుత్వంపై అర్ధరహితమైన విమర్శలు చేస్తున్నారు. మీకు, మీ ప్రభుత్వానికి నిజంగా తెలంగాణా రాష్ట్రం మీద, ప్రజల మీద అంత ప్రేమ ఉంటే, రాష్ట్రానికి బాకీ ఉన్న 11,500 కోట్లు నిధులను తక్షణమే విడుదల చేయండి. ఎయిమ్స్, గిరిజన, హార్టికల్చర్ యూనివర్సిటీల స్థాపనకు తక్షణమే అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయండి. తక్షణమే హైకోర్టును విభజించి తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టును ఏర్పాటు చేయండి. మీరు చేయవలసిన పనులేవీ చేయకుండా, పని చేస్తున్న మా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించవద్దు. తెలంగాణా రాష్ట్రాన్ని, ప్రజలను కించపరిచేవిధంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించాలని ప్రయత్నించి, మా ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకు ప్రయత్నించినందుకు కనీసం ఇప్పటికైనా బేషరతుగా రాష్ట్ర ప్రజలకు భాజపా నేతలు క్షమాపణలు చెప్పాలి. అప్పుడే మీపై ప్రజలకు కనీస గౌరవం మిగులుతుంది,” అని హరీష్ రావు అన్నారు.