ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు మళ్ళీ రోజుకొక సమస్య ఎదుర్కోవలసివస్తోంది. ఏపిలో వెనుకబడిన రాయలసీమకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ నేడు వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపునిచ్చాయి. రాయలసీమకు పరిశ్రమలు, ఉద్యోగాలు, సాగునీరు, త్రాగునీరు, వ్యవసాయం..అన్ని రంగాలలో అన్యాయం జరుగుతోందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాయలసీమ అభివృద్ధి కోసం కేంద్రప్రభుత్వం ఏటా అందిస్తున్న నిధులను కూడా తెదేపా సర్కార్ పక్కదారి పట్టిస్తోందని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.
రాయలసీమలో రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలు చేసుకొంటుంటే, తెదేపా నేతలు నిసిగ్గుగా గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు. తెదేపా నేతలు ఎంతసేపు తమ ప్రభుత్వాన్ని పొగుడుకోవడం తప్ప ఈ మూడేళ్ళలో రాయలసీమ అభివృద్ధికి ఏమి చేశారని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అమరావతి అభివృద్ధి మీద ఉన్న శ్రద్ధ రాయలసీమపై లేకపోవడం చాలా దురదృష్టకరం అని అన్నారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు సీమను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు.
ఈరోజు ఉదయం నుంచి సీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో వామపక్షాలు ఎక్కడికక్కడ డిపోల వద్దనే ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో చాలా ప్రాంతాలలో బస్సులు నిలిచిపోయాయి. బంద్ నేపద్యంలో బారీగా మొహరించబడిన పోలీసులు వామపక్షాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ కారణంగా తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
సాధారణంగా తెదేపా సర్కార్ కు వ్యతిరేకంగా జరిగే ఏ పనికైనా వెంటనే మద్దతు పలికే కాంగ్రెస్, వైకాపాలు ఈ బంద్ కు దూరంగా ఉండటం ఆశ్చర్యకరమే. ముఖ్యంగా రాయలసీమకు చెందిన జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంతం కోసం జరుగుతున్న ఈ బంద్ కు దూరం ఉండటం మరీ విచిత్రమే. ఇది ఏ రాజకీయ సమీకరణాలకు సంకేతమో చూడాలి.