తెదేపాలో నుంచి మరొకరు జంప్

తెలంగాణాలో తెదేపాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్ తను పార్టీ వీడి తెరాసలో చేరబోతున్నట్లు మంగళవారం ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో తనకు ఖానాపూర్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఈనెల 29న తన అనుచరులతో కలిసి ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతునట్లు తెలిపారు. 

దళితవర్గానికి చెందిన రమేష్ రాథోడ్ 1999 ఎన్నికలలో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికలలో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా రాజకీయాలలో ఉన్నారు. ఆమె 2009 నుంచి 2014 వరకు ఖానాపూర్ శాసనసభకు ప్రాతినిద్యం వహించారు. వారిరువురికీ వారి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉంది. కనుక ఇప్పుడు వారిరువురూ, వారితో బాటే ఆ నియోజకవర్గంలోని తెదేపా కార్యకర్తలు తెరాసలో చేరిపోతే అక్కడ తెదేపా బలహీనపడుతుంది. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించేందుకు తెదేపాకు బద్ధశత్రువైన కాంగ్రెస్ పార్టీతోనైనా పొత్తులు పెట్టుకోవడానికి సిద్దం అని రేవంత్ రెడ్డి చెపుతుంటే, మరోవైపు పార్టీలో ముఖ్యనేతలు తెరాసలో చేరిపోతుండటం విశేషం.