ప్రభుత్వోద్యోగులకు శుభవార్త

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త! మూడేళ్ళ క్రితం ప్రభుత్వం వారికి 43 శాతం ఫిట్ మెంట్ పెంచింది. కానీ ఇంతవరకు జూన్ 2014 నుంచి ఫిబ్రవరి 2015 వరకు బాకీ ఉన్న 9 నెలల ఎరియర్స్ రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వారి ఎరియర్స్ ఫైల్ పై సంతకం చేశారు. ఎరియర్స్ మొత్తంలో 50 శాతం ఈ జూన్ నెల నుంచి వాయిదాల పద్దతిలో చెల్లించబడుతుంది. మిగిలిన 50 శాతం ఎరియర్స్ వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి నగదు రూపంలోనే చెల్లించబడతాయి. తెలంగాణా ధనిక రాష్ట్రమని పదేపదే చెప్పుకొంటున్నప్పుడు, మూడేళ్ళ క్రితం చెల్లించవలసిన ఎరియర్స్ ను ఇంతవరకు చెల్లించలేకపోవడం, మళ్ళీ దానిని కూడా వాయిదాల పద్దతిలో మరో ఏడాదిన్నర పాటు చెల్లించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ధనిక రాష్ట్రమైన తెలంగాణా పరిస్థితే ఇలా ఉంటే, తెలంగాణా ప్రభుత్వంతో పోటీ పడి దాదాపు అంతే మొత్తం ఫిట్ మెంట్ ప్రకటించిన ఆంధ్రా సర్కార్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో?