మంత్రులు టచ్ లో ఉన్నారుట!

"చాలా మంది మంత్రులు, తెరాస నేతలు మాతో ‘టచ్’ లో ఉన్నారని కాంగ్రెస్ లేదా భాజపాలు అంటే అనుమానించక్కర లేదు. కానీ ఇంకా ప్రారంభం కానీ ‘తెలంగాణా ఇంటి పార్టీ’ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే, ఇంతవరకు ఆ పార్టీలో ఎవరెవరు ప్రముఖులున్నారో తెలియదు. ప్రొఫెసర్ కోదండరామ్ ను ఆహ్వానిస్తే ఆయన ఇంతవరకు స్పందించలేదు. గద్దర్ ని పిలిస్తే అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని అంటున్నారు. కనుక ఆ పార్టీలో ఎవరు చేరుతారో ఇంకా తెలియదు. కానీ తమ పార్టీలో చేరేందుకు పలువురు తెరాస మంత్రులు సిద్దంగా ఉన్నారని చెప్పడం నమ్మశక్యంగా లేదు. అతిశయోక్తిగా ఉంది.

అసలు పార్టీ ఇంకా ప్రారంభమే కాలేదు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీని ప్రారంభిస్తామని సుధాకర్ చెపుతున్నారు. తెరాస సర్కార్ అన్ని విధాల వైఫల్యం చెందిందని అందుకే దానికి ప్రత్యమ్నాయం అవసరం అని భావించి ఈ తెలంగాణా ఇంటి పార్టీని స్థాపిస్తున్నట్లు సుధాకర్ చెపుతున్నారు. అయితే తెరాస ధాటికి మహామహా కాంగ్రెస్, తెదేపా,భాజపా, వామపక్షాలే నిలువలేకపోతున్నాయి. మరి కొత్తగా వస్తున్న ఈ ఇంటి పార్టీ తెరాసను డ్డీ కొని నిలువగలదా?లేదా అనేది ఆ పార్టీ నిర్మాణం జరిగిన తరువాతే తెలుస్తుంది.