కార్తి చిదంబరం లండన్ కి జంప్?

మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంల ఇళ్ళు, కార్యాలయాలపై ఇటీవల సిబిఐ దాడులు చేసి శోదాలు నిర్వహించింది. వాటిపై చిదంబరం స్పందిస్తూ, తాను, తన కుమారుడు, అతని స్నేహితులు ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే తమపై ఈ దాడులు చేయిస్తోందని, అటువంటి బెదిరింపులకు తామేమీ భయపడబోమని అన్నారు. కానీ కార్తి చిదంబరం నిన్న లండన్ వెళ్ళడంతో ఆయన ఈ కేసులకు భయపడే దేశం విడిచి పారిపోయారని ఊహాగానాలు మొదలైపోయాయి. 

వాటిపై మళ్ళీ చిదంబరం స్పందిస్తూ, “ఈ ప్రయాణం చాలా కాలం క్రితం ప్లాన్ చేసుకొన్నదే..సిబిఐ దాడులతో సంబంధం లేదు. కార్తి తన స్వంత పనుల మీద లండన్ వెళ్ళారు. మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తారు. అయినా నా కొడుకు విదేశాలకు వెళ్ళకూడదనే నిషేధం ఏమి లేదు కదా? అతనిపై ఎవరు ఎందుకు ఈ పుకార్లు సృష్టిస్తున్నారు?” అని ప్రశ్నించారు. 

చిదంబరం చెప్పింది నిజమే కావచ్చు. ఒకవేళ ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగిరాకపోతే అప్పుడు ఆయన నేరం చేయబట్టే ఈ కేసులకు భయపడే పారిపోయాడనే వాదనలకు బలం చేకూరుతుంది. అప్పుడు తాము నిర్దోషులమని వాదిస్తున్న చిదంబరం చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కేసు ఆయన రాజకీయ జీవితంపై కూడా చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కనుక తండ్రీకొడుకులుఇద్దరూ ఎంత కష్టమైనా దేశంలోనే ఉంటూ ఈ కేసులను ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు.