కేసీఆర్ పట్టుపడితే...

ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా ఒక పని చేయాలని గట్టిగా భావిస్తే అది సాధించి తీరుతారు. తెలంగాణా సాధన మొదలు జిల్లాల పునర్విభజన, గ్రేటర్ ఎన్నికలలో విజయం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసేకరణ, ముస్లిం రిజర్వేషన్ బిల్లులు ఇప్పుడు తాజాగా కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం కేంద్రం నుంచి సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ సాధించుకురావడం అందుకు చక్కటి ఉదారణలు.    

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు సికింద్రాబాద్ లోని రక్షణశాఖ అధీనంలో ఉన్నా 61.32 ఎకరాల విస్తీర్ణం గల బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించింది. అయితే నగరం నడిబొడ్డున ఉన్న ఈ భూముల విలువ కొన్ని వేల కోట్లు ఉంటుంది కనుక వేరే చోట అంతే విలువగల భూములను ఇవ్వమని రక్షణశాఖ కోరవచ్చును. కాప్రాలో షామీర్ పెట్ మండలంలో జవహార్ నగర్ గ్రామం పరిధిలో గల భూములైతే కంటోన్మెంట్ కు ఆనుకొని ఉంటాయి కనుక అక్కడ భూమినిని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ  రక్షణశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి చెరో 500 ఎకరాల భూమి ఉంది.    

బైసన్ పోలో గ్రౌండ్స్ 31.18 ఎకరాలు, జింఖానా గ్రౌండ్స్ 23.19 ఎకరాలు విస్తీర్ణం ఉన్నాయి. త్వరలో రక్షణశాఖ ఉన్నతాధికారులు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది.వారి పర్యటనలో ఈ భూమార్పిడిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.    

పాత సచివాలయానికి వాస్తు దోషం ఉందని నమ్ముతున్న కారణంగానే బహుశః ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడికి వెళ్ళకుండా వాస్తు ప్రకారం నిర్మించుకొన్న తన ప్రగతి భవన్ నుంచే పరిపాలన సాగిస్తున్నట్లున్నారు. ఇప్పుడు రక్షణశాఖ భూములు ఇవ్వడానికి అంగీకరించింది కనుక అవి చేతికి రాగానే సచివాలయం నిర్మాణ పనులు మొదలుపెట్టి ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేసి దానిలో అడుగుపెడతారేమో?