ఆయన ఆమె యొక్క ఏజంట్

భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ చాలా రోజుల తరువాత తన నోటికి ఈరోజు పని చెప్పారు. “మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం చాలా అవినీతిపరుడు. ఆయన సోనియా, రాహుల్ గాంధీల మనీ ల్యాండరింగ్ ఏజెంటుగా పని చేసేవారు. వారికీ, తన కుమారుడు కార్తికి లబ్ది కలిగించేందుకే విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాక మండలి చేత అనేకసార్లు అనుమతులు మంజూరు చేయించేరు. అందరూ కలిసి దేశ సంపదను దోచుకొన్నారు. చిదంబరం తన ప్రమాణస్వీకారం చేసిన వాగ్దానినికి భంగం కలిగించే విధంగా తన అధికారాన్ని దుర్వినియోగ పరిచి తన కొడుకు కార్తికి, సోనియా, రాహుల్ గాంధీలకు లబ్ది కలిగించే విధంగా అనేక తప్పుడు పనులు చేశారు. మళ్ళీ ఎవరూ అటువంటి తప్పులు మరెవరూ చేయకుండా నివారించేందుకు చిదంబరంపై కటినమైన చర్యలు తీసుకోవాలి.

ఆయన నల్లకోటు వేసుకొని కోర్టుకు వెళ్ళినంత మాత్రాన్న ఏమీ జరిగిపోదు. ఆయన న్యాయపరిజ్ఞానం కేసులలో బెయిలు తెచ్చుకొనేందుకు మాత్రమే సరిపోతుంది. ఒకవేళ ఆయన తను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నమ్ముతున్నట్లయితే మా ప్రభుత్వంపై హూంకరించడం ఎందుకు? తన గొంతు నొక్కేస్తున్నామని బాధపడటం ఎందుకు? కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవచ్చు. ఆయన తనను తాను పెద్ద మేధావిని అనుకొంటారు. కానీ ఆయన రాసే రాతలపై ఎవరూ ఆసక్తి చూపరు,” అని సుబ్రహ్మణ్య స్వామి కడిగిపడేశారు.