రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న పిడమర్తి రవి మంగళవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ‘రిజర్వేషన్ల పెంపుపై కుల సంఘాల రౌండ్ టేబిల్ సమావేశానికి’ హాజరయినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ సమావేశంలో పాల్గొన్న వక్తలు దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు. పిడమర్తి రవి మాట్లాడుతూ చిరకాలంగా రాష్ట్ర రాజకీయాలు రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉండిపోయిందని, వారు దళితులను పట్టించుకోకుండా తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, బలహీనవర్గాలు అన్నీ కలిసి తమ రిజర్వేషన్లను కాపాడుకొనేందుకు ఉద్యమించవలసి ఉందని అన్నారు.
పిడమర్తి రవి తెరాసకు చెందిన నేత కనుక తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రిజర్వేషన్లకు మద్దతుగా మాట్లాడటం సహజమే. కానీ మంత్రి పదవే పొందలేని ఆయన ఏకంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకోరు కదా? తెరాస అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికే ఆ పార్టీలో నేతలెవరూ సాహసించలేనప్పుడు ఇక ముఖ్యమంత్రి కావడం గురించి ఆలోచించగలరా? ఆలోచించినా ఫలితం ఉండదు పైగా అటువంటి ఆలోచనలున్నట్లుపార్టీ అధిష్టానానికి తెలిస్తే బహిష్కరణ వేటు పడే అవకాశం ఉంటుందనేది బహిరంగ రహస్యమే.
కానీ తెలంగాణా ఏర్పడితే మొదట దళితుడినే ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు ఆ సమావేశంలో పాల్గొన్న వారి మనసులలో ఇంకా మెదులుతున్నాయేమో.. “పిడమర్తి రవి వంటి యువకుడు తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడే దళితులకు న్యాయం జరుగుతుందని” అన్నారు. తెరాస సర్కార్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎప్పుడూ గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడే పిడమర్తి రవి ఆ మాటలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక చాలా ఇబ్బందిపడ్డారు. ఇంకా అక్కడే ఉంటే ముఖ్యమంత్రికి తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందనే భయంతో ఆయన సమావేశం మద్యలోనే లేచి వెళ్ళిపోయారు.