లేక్ వ్యూ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, సుమారు 15-20 మంది మహిళా పోలీసులు సాధారణ దుస్తులు ధరించి, ‘ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ తరలించాలని’ వ్రాసున్న ప్లకార్డులు పట్టుకొని నిన్న ఉదయం స్థానిక ప్రజలతో కలిసి ధర్నా చేస్తుండగా మీడియా ప్రతినిధులు గుర్తించి వారిని వీడియోతో చిత్రీకరించారు. వెంటనే వారందరూ చేతిలో ఉన్న ప్లకార్డులు పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతసేపు తరువాత సి.ఐ. శ్రీదేవి పోలీస్ యూనిఫారం ధరించి మళ్ళీ అక్కడికికే వచ్చి విధులు నిర్వహించడంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమె సాధారణ దుస్తులలో పోలీస్ యూనిఫారంలో ఉన్న రెండు ఫోటోలను తీసి పక్కపక్కన పెట్టి చూపించడంతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోవడం ప్రభుత్వానికి చాలా కష్టం అయిపోయింది. స్థానికుల ముసుగులో ప్రభుత్వమే మహిళా పోలీసుల చేత ధర్నా చేయించి మోసపూరితంగా వ్యవహరించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ వారి ఆరోపణలను కొట్టిపడేశారు. ప్రతిపక్షాలే బయట నుంచి గూండాలను తీసుకువచ్చి స్థానికులపై దాడులు చేశాయని వారు ఆరోపించారు. నిన్న జరిగిన హింసాత్మక సంఘటనలకు ‘మీరే బాధ్యత వహించాలంటే..కాదు మీరే..’ అని అధికార, ప్రతిపక్ష నేతలు వాదించుకొంటున్నారు. ఇంత రభస జరిగిన తరువాతైనా ధర్నా చౌక్ సమస్య పరిష్కారం అయ్యిందా? అంటే లేదు. దానిపై కోర్టు తీర్పు చెపితే తప్ప స్పష్టత రాదు. కానీ స్థానికులతో కలిసి ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేస్తూ మీడియాకు చిక్కిన లేక్ వ్యూ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీదేవిని కంట్రోల్ రూమ్ కు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రతిపక్షాల వాదన నిజమని రుజువైంది కదా! మరి మంత్రులు ఇద్దరూ ఇప్పుడేమి అంటారో?