ఇందిరా పార్క్ వద్ద నిన్న జరిగిన ఘటనలపై రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో వామపక్షాలకు ప్రజాధారణ లేదని ఎప్పుడో తేలిపోయింది. కనుక వారు ఏదో ఒక ప్రధానపార్టీకి ‘తోకపార్టీ’గా కొనసాగక తప్పదు. తమ ఉనికిని చాటుకోవడానికి ప్రజలపై దాడులకు పాల్పడితే వారి చేతుల్లోనే చస్తారు. ఇక ఎప్పటికైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలుగంటూ గెడ్డం పెంచుతున్న ఉత్తం కుమార్ రెడ్డి కలలు ఎప్పటికీ నెరవేరే అవకాశం లేదు. చివరకి ఆయన గెడ్డం కుమార్ రెడ్డిగానే మిగిలిపోవడం ఖాయం. మా పరిపాలన ప్రొఫెసర్ కోదండరామ్ కు నచ్చకపోతే నష్టమేమీ లేదు. ప్రజలకు నచ్చడం ముఖ్యం. ఒకవేళ వారికి నచ్చకపోతే వచ్చే ఎన్నికలలో ఎవరికీ ఓటు వేసి గెలిపించాలో వారే నిర్ణయించుకొంటారు. కనుక ప్రతిపక్షాల అండ చూసుక్ని ప్రొఫెసర్ కోదండరామ్ రెచ్చిపోకుండా మా ప్రభుత్వాన్ని పనిచేసుకోనిస్తే బాగుంటుంది. వామపక్ష కార్యకర్తలు నిన్న ఇందిరా పార్క్ వద్ద స్థానికులపై దాడులు చేసిన తరువాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడుగుపెట్టగలరా? పెడితే వారిని స్థానికులు తరిమికొట్టకుండా ఉంటారా? ధర్నా చౌక్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దానిపై కోర్టు నిర్ణయం వెలువడిన తరువాతే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొంటుంది. అక్కడ ధర్నా చౌక్ కొనసాగించవద్దని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకే పనిచేస్తుంది తప్ప ప్రొఫెసర్ కోదండరామ్ లేదా ప్రతిపక్షాల అభీష్టానికి అనుగుణంగా పనిచేయదని వారు గుర్తుంచుకోవాలి. ఇందిరా పార్క్ వద్ద నిన్న జరిగిన ఘటనలకు ప్రతిపక్షాలే పూర్తి బాధ్యత వహించాలి,” అని అన్నారు.