అనంతపురం జిల్లా నుంచి జనసేన పార్టీ నిర్మాణం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్, ఆ జిల్లా నుంచి పార్టీ కోసం ఎంపిక చేసిన 150 మందితో ఆదివారం హైదరాబాద్ లో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను పార్ట్-టైం పొలిటిషియన్ అని కొందరు రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. కానీ వారందరూ కూడా ఏవో ఒక సైడ్ బిజినెస్ లు చేసుకొంటూ బాగానే డబ్బు సంపాదించుకొంటున్నారు. అసలు సైడ్ బిజినెస్ చేయని రాజకీయ నాయకుడు ఎవరున్నారు? వారు ధనార్జనే లక్ష్యంగా వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తుంటే నేను నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే సినిమాలలో నటిస్తున్నాను. కానీ ప్రజా సమస్యలపై పోరాడేందుకు అవసరమైతే సినిమాలలో నటించడం వాయిదా వేసుకోవడానికైన నేను సిద్దమే. అనంతపురం జిల్లా సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటిపై అవగాహన పెంచుకోనేందుకే త్వరలోనే మూడు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తాను,” అని పవన్ కళ్యాణ్ చెప్పారు.