మాకు ఈవిఎంలు ఓకే: తెరాస

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవిఎం) ప్రతిపక్ష పార్టీల అనుమానాలను నివృతి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ శుక్రవారం దేశంలో అన్ని ప్రధాన పార్టీల ప్రతినిధులతో శుక్రవారం డిల్లీలో సమావేశం నిర్వహించింది. దానిలో తెరాస ప్రతినిధిగా పాల్గొన్న ఎంపి పి.వినోద్ ఈవిఎంలపై తమ పార్టీకి ఎటువంటి అనుమానాలు లేవని, వాటితోనే ఎన్నికల నిర్వహణ జరగాలని తాము కోరుకొంటున్నామని చెప్పారు. “ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఇంకా ఆధునికమైన ఈవిఎంలను ఉపయోగించాలని కోరితే అర్ధం ఉంటుంది కానీ అసలు వాటిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహించాలని కోరడం అవివేకమే. మన ఎన్నికల కమీషన్ చాలా అద్భుతంగా, నిష్పక్షపాతంగా దేశంలో ఎన్నికలను నిర్వహిస్తోంది. కనుక దేశంలో రాజకీయ పార్టీలు ఈవిఎంలను అనుమానించే బదులు వాటిని ఏవిధంగా ఉపయోగించాలో ప్రజలకు వివరిస్తే బాగుంటుంది,” అని ఎంపి వినోద్ అన్నారు.

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో యూపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో, ఆ తరువాత జరిగిన డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో భాజపా చేతిలో ఘోరంగా ఓడిపోయిన ప్రతిపక్షాలు ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి భాజపా గెలిచిందనే వాదన మొదలుపెట్టాయి. ఒకవేళ వాటి వాదనే నిజమనుకొంటే, భాజపా అధికారంలో ఉన్న పంజాబ్, గోవా రాష్ట్రాలలో భాజపా కూడా ఘన విజయం సాధించి ఉండేది కదా? కానీ పంజాబ్ లో భాజపా ఓడిపోయింది. గోవా, మణిపూర్ రాష్ట్రాలలో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలువగా భాజపా రెండవ స్థానంలో నిలిచింది. అంటే ఈవిఎంల ట్యాంపరింగ్ చేసిందనే ప్రతిపక్షాల వాదన అర్ధరహితమని తేలిపోయింది. కర్ణుడు చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ ఓడిపోవడానికి అన్ని కారణాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈవిఎంల విషయంలో ప్రజలు ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. రాజకీయ పార్టీలే వ్యక్తం చేసాయి. కనుక రాజకీయ నేతలనే చైతన్యపరచవలసి ఉంది. ఈసి ఇప్పుడు అదే చేస్తోంది.