భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఆయన మే 22, 23, 24 తేదీలలో మూడు రోజుల పాటు తెలంగాణాలో పర్యటిస్తారు. మే 22న నల్లగొండ జిల్లా మునుగోడులో, 23న నాగార్జున సాగర్ మరియు మిర్యాలగూడ, 24న నకిరేకల్, భువనగిరి మరియు హైదరాబాద్ లో పర్యటిస్తారు. నియోజకవర్గం స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన రాష్ట్ర నేతలకు మార్గదర్శనం చేస్తారని సమాచారం.
ఇక రాహుల్ గాంధీ జూన్ 1వ తేదీన హైదరాబాద్ రాబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఆరోజున సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.
కాంగ్రెస్, భాజపా అధినేతలు తెలంగాణా రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టి పర్యటనలు చేయడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, “అమిత్ షా వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ఆ ప్రభావం తెలంగాణా ప్రజలపై ఉండదు. కాంగ్రెస్, భాజపాలు రెండూ మా ప్రభుత్వం గురించి ఎంత దుష్ప్రచారం చేసినా వాటిని ప్రజలు నమ్మబోరు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ మా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో చాలా సంతృప్తిగా ఉన్నారు. కనుక ఎవరు వచ్చినా మాపార్టీకి ఎటువంటి నష్టమూ ఉండదు,” అని అన్నారు.