రేపటి నుంచే మూడో ప్రపంచయుద్ధం షురూ?

అనానిమస్ అనే ఒక హ్యాకర్ల బృంద కొన్ని రోజుల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేసింది. దానిలో మే 13 నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చని పేర్కొంది. ఉత్తరకొరియా-అమెరికా మద్య నెలకొన్న యుద్దవాతావరణం, ఆ రెండు దేశాల అధినేతల దుందుకుతనమే అందుకు కారణం. రెండు దేశాలు అణ్వాయుధాలతో దాడులు చేసుకొనేందుకు ఎదురెదురుగా నిలిచి సిద్దంగా ఉన్నాయి. 

దక్షిణ కొరియాలో తిష్ట వేసిన అమెరికా సేనలు, అధికారులు, అలాగే కొరియా సముద్రజలాలలో  ఉన్న అమెరికా యుద్ద నౌకలు తక్షణం వెనక్కి తిరిగివెళ్ళకపోతే ఏ క్షణాన్నైనా అమెరికా మీద అణుబాంబులతో దాడి చేసి అమెరికాను భస్మం చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరిస్తోంది. తమ అణుబాంబు దాడి నుంచి బ్రతికి బయటపడినవారికి కనీసం త్రాగడానికి మంచి నీళ్ళు దొరకని పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదని ఉత్తర కొరియా వాదిస్తోంది. 

కానీ అమెరికా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉత్తరకొరియా మరొక్కసారి అణ్వస్త్ర పరీక్షలు జరిపితే ఆ దేశంపై దాడి చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమని స్పష్టం చేసింది. రెండు దేశాధినేతలు చాలా దుందుడుకుగా వ్యవహరించేవారే కనుక ఏ క్షణానైన యుద్ధం మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. 

మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవచ్చని అందరూ ఊహిస్తే, యూపికి చెందిన ప్రమోద్ గౌతం అనే జ్యోతిష్యుడు మాత్రం ఖచ్చితంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుస్తారని జోస్యం చెప్పాడు. అతను చెప్పినట్లే జరిగింది. ఇప్పుడు అదే ట్రంప్ కారణంగా మే 13 నుంచి మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చని జోస్యం చెపుతున్నాడు. ప్రస్తుతం ట్రంప్ పై అంగారక గ్రహం ప్రభావం చాలా అధికంగా ఉందని, కనుక ఆయన చాలా దుందుడుకుగా నిర్ణయాలు తీసుకొంటారని ఆ కారణంగా అమెరికాకు పెను సమస్యలను ఎదుర్కోబోతోందని ప్రమోద్ గౌతం చెపుతున్నారు. చెప్పడమే కాదు ఈ యుద్దాన్ని నివారించేందుకు ఆయన తన శిష్యులతో కలిసి ఆగ్రా వద్ద యమునానదీ తీరంలో ప్రపంచ శాంతి యజ్ఞం నిర్వహిస్తున్నారు. దానిలో మృత్యుదేవుడు యముడికి పూజలు చేసి ప్రసన్నం చేసుకొని యుద్దాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రమోద్ గౌతం చెప్పారు. మరి మూడో ప్రపంచయుద్ధం నిజంగానే జరుగుతుందా లేక చైనా, రష్యా, ఐక్యరాజ్యసమితి జోక్యంతో యుద్ధం నివారించబడుతుందా? అనేది త్వరలోనే తేలిపోతుంది.