రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కలిసి ఈ నెల 15న నిర్వహించబోయే ‘సేవ్ ధర్నా చౌక్’ ఆందోళనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మరి కొందరు నేతలు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసి తమ పోరాటానికి మద్దతు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు లేదా ప్రభుత్వం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యబద్ధమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి ఆ హక్కును హరించే ఏ ప్రభుత్వానికి ఉండదని పవన్ కళ్యాణ్ అన్నారు. కనుక ‘సేవ్ ధర్నా చౌక్’ ఆందోళనకు జనసేన మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ సందర్భంగా వారు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఈ జూన్ నెలలో వామపక్షాలు, గద్దర్ (మహాజనం), ప్రొఫెసర్ కోదండరామ్ ( తెలంగాణా రాజకీయ జెఏసి), జస్టిస్ చంద్రకుమార్ (ప్రజావేదిక) మొదలైన ప్రజాసంఘాలతో కూడిన ఒక రాజకీయ వేదిక ఏర్పాటు కాబోతోంది. దానిలో చేరడానికి పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తిగా ఉన్నారని తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ అక్టోబర్ నాటికి సినిమాలన్నీ పూర్తి చేసి ఇక పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రా, తెలంగాణా రెండు రాష్ట్రాలు తనకు సమానమేనని, రెండు ప్రాంతాలలో ప్రజా సమస్యలపై జనసేన పోరాడుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.