ఏపి మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ, అతని మిత్రుడు రవివర్మల అకాల మరణం వారి తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనకు కారణం అతివేగమే కారణమని వైద్యులు, పోలీసులు చెపుతున్నప్పటికీ వారి కారులో మద్యం సీసాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. కారణం ఏదైనప్పటికీ వారిరువురూ చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమే. నగరంలో ధనికుల పిల్లలు ఇటువంటి ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం వారి ముచ్చట తీర్చేందుకు వారి తల్లితండ్రులు చాలా ఖరీదైన, శక్తివంతమైన వాహనాలు కొనివ్వడమేనని చెప్పక తప్పదు. నిశిత్ నారాయణఉపయోగిస్తున్న బెంజ్ కారు కూడా అటువంటిదే. 571 హార్స్ పవర్ కలిగిన అత్యంత శక్తివంతమైన ఆ కారు కేవలం 5.4 సెకన్ల వ్యవదిలోనే 100 కిమీ వేగం అందుకోగలదు. అంటే యాక్సిలేటర్ కు కాలు తాకిస్తే చాలు అది రేసు గుర్రం కంటే వేగంగా పరుగులు తీస్తుందన్న మాట. ప్రమాదం జరిగినప్పుడు అది 100కిమీ కంటే ఎక్కువ వేగంతోనే పయనిస్తూ మెట్రో పిల్లర్ ను డ్డీ కొన్నట్లు తెలుస్తోంది. రూ.2.5 కోట్లు ఖరీదైన ఆ కారు అంతర్జాతీయ భద్రతాప్రమాణాలకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయినా అవేవి వారి ప్రాణాలను కాపాడలేకపోయాయి అంటే అది స్వీయ తప్పిదమేనని అర్ధం అవుతోంది.
నిశిత్ నారాయణ గతంలో కూడా కారును గంటకు 150కిమీ వేగంతో నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు 3 సార్లు చిక్కి జరిమానాలు చెల్లించాడు. కానీ అతను తీరు మారలేదని ఈ సంఘటన నిరూపించింది. ఈసారి అతివేగానికి అతను ఒక్కడే కాకుండా అతని స్నేహితుడు రవివర్మ, వారి ఇరువురి కుటుంబాలు కూడా భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది.
మన క్షేమం కోరే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న సూచనలను, హెచ్చరికలను చాలా మంది ఇబ్బందిగా భావిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోవడం, కారు సీటు బెల్ట్ పెట్టుకోవడం కంటే పోలీసులకు చలానా కట్టేసివెళ్లిపోవడానికే చాలా మంది మొగ్గు చూపుతుంటారు. కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు మన శ్రేయోభిలాషులుగా చెపుతున్న మాటలు ఎంత విలువైనవో అర్ధం అవుతుంది.
కొద్ది సేపటి క్రితం నిశిత్ నారాయణ అంత్యక్రియలు నెల్లూరులో పూర్తయ్యాయి. కొడుకు చేత తల కొరివి పెట్టించుకోవాలని తల్లి తండ్రులు కోరుకొంటారు. కానీ పాపం..మంత్రి నారాయణ స్వయంగా తన కొడుకు చితికి నిప్పు పెట్టవలసి రావడం చాల బాధాకరం.