తెరాసలో చేరాలనే ఆశతో తెదేపాను వీడి ఆశాభంగం చెందిన నాగం జనార్ధన రెడ్డి, మళ్ళీ తెదేపాలోకి వెళ్ళలేక చివరకు భాజపాలో చేరారు. కానీ ఆయన అక్కడ కూడా ఇమడలేకపోతున్నారనే వార్తలు అప్పుడప్పుడు వస్తున్నాయి. వాటిని బలపరుస్తున్నట్లే ఆయన రాష్ట్ర భాజపా నేతలతో కలిసి ఎన్నడూ కనబడరు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనరు. జాతీయ నాయకులు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే నాగం ప్రజలకు కనిపిస్తుంటారు. కనుక ఆయన రాజకీయాలలో ఉన్నారో లేరోననే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం చేస్తానంటున్నారు. అయితే ఊరికే కాదు. తెరాస సర్కార్ మహబూబ్ నగర్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించామని గొప్పలు చెప్పుకొంటోంది. అది నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని నాగం జనార్ధన రెడ్డి తెరాస సర్కార్ కు సవాలు విసిరారు.
జిల్లా కేంద్రంలో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వలన జిల్లాలో కేవలం 60-70,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు పారుతున్నాయి. కానీ తెరాస సర్కార్ మాత్రం 5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని అబద్దాలు చెపుతూ ప్రజలను, రైతులను మోసం చేస్తోంది. అది నిరూపించితే నేను రాజకీయ సన్యాసం స్వీకరించడానికి సిద్దం. తెరాస సర్కార్ ప్రాజెక్టుల కోసం రూ.80,000 కోట్లు విడుదల చేశానని గొప్పలు చెప్పుకొంటోంది కానీ వాస్తవంగా ఇంతవరకు ఎంత విడుదల చేసింది? చెప్పగలదా? సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి బారీగా నిధులు విడుదల చేస్తోంది. ఆ విషయం కూడా తెరాస సర్కార్ దాచిపెట్టి అంతా తనే పెట్టుకొంటున్నట్లు ప్రచారం చేసుకొంటోంది. కేంద్రం ఇస్తున్న నిధులపై తెరాస సర్కార్ శ్వేతపత్రంవిడుదల చేయాలి. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన సంస్థను ఏర్పాటు చేస్తామని చెపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెరాస పాలనలో అవినీతి పెరిగిపోతోందని నిత్యం ఎసిబికి పట్టుబడుతున్న అధికారులను, వారు అక్రమంగా పోగేసుకొన్న ఆస్తులను చూస్తే అర్ధం అవుతుంది,” అని తీవ్రంగా విమర్శించారు.
నాగం జనార్ధన రెడ్డి తెరాస సర్కార్ విమర్శలకు తెరాస నేతలు జవాబు చెప్పవచ్చు. కానీ ఆయన ప్రస్తుతం రాజకీయాలలో, భాజపాలో ఉన్నారా లేక రాజకీయ సన్యాసం తీసుకొనే యోచనలో ఉన్నారో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది కదా?