మావోయిస్ట్ మద్దతుదారుడు వరవరరావు తెరాస సర్కార్, దాని పాలనపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పడటం అంటే తెరాస సర్కార్ అధికారంలోకి రావడం అని అర్ధం కాదు. తెరాస కోసం రాష్ట్రం ఏర్పడలేదు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికే 1400 మంది యువకులు బలిదానాలతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత దాని కోసం పోరాడిన తెరాస అధికారంలోకి వచ్చింది కనుక తెలంగాణా సాధన లక్ష్యం నెరవేరినట్లే భావించరాదు. తెలంగాణా ఏర్పాటు తరువాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం తదుపరి లక్ష్యం. దానిని సాధించుకోనేంత వరకు నిరంతరం చర్చలు అవసరమైతే పోరాటాలు చేయక తప్పదు. ఇది నిరంతరంగా సాగే ఒక జీవన విధానం. దీనిని ప్రభుత్వం, అన్ని పార్టీలు అంగీకరించి తదనుగుణంగా నడుచుకోవలసి ఉంటుంది,” అని వరవరరావు అన్నారు.