మన హైదరాబాద్ విశ్వనగరం. శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మన పాలకులు చెప్పే మాటలు విని చాలా సంతోషం కలుగుతుంటుంది. అయితే అవన్నీ వర్షాలు పడనంతవరకు మాత్రమేనని ప్రతీసారి వరుణదేవుడు రుజువు చేస్తుంటాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా కురిసిన బారీ వర్షాలకు నగరంలో చాలా ప్రాంతాలలో రోడ్ల మీదకు నీళ్ళు చేరడంతో అనేక చోట్ల బారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్ పేట నుంచి కూకట్ పల్లి వరకు దాదాపు రెండు మూడు గంటల సేపు ట్రాఫిక్ నిలిచిపోయిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒకవైపు వర్షం, మరోపక్క చెరువులు తలపించే రోడ్లు, ట్రాఫిక్ జామ్స్ కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.
నగరం నడిబొడ్డునున్న పంజాగుట్ట, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, రామంతాపూర్ వంటి ప్రాంతాలలోనే కాకుండా బోయినపల్లి, దిల్ షుక్ నగర్, అల్వాల్, కాప్రా, మొయినాబాద్ వంటి ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వర్షంతో బాటు ఈదురుగాలులు కూడా వీచడంతో నగరంలో అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో అది మరొక పెద్ద సమస్యగా మారింది. చెట్లు తొలగించే వరకు ట్రాఫిక్ జామ్, విద్యుత్ స్తంభాలు నేలకొరిగినందున విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
గత ఏడాది బారీ వర్షాలు పడినప్పుడు నగరంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో, నిన్న ఒక్కరోజు పడిన వానకు మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడటం గమనిస్తే ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం సరిపోలేదని అర్ధం అవుతోంది. ఒక్కరోజు వర్షానికే ఈ పరిస్థితి ఉంటే త్వరలో వర్షాకాలం ప్రారంభం అయితే నగరంలో పరిస్థితి ఎలా ఉంటుందో? అనే సందేహం కలుగక మానదు. కనుక జి.హెచ్.ఎం.సి. అధికారులు యుద్దప్రాతిపదికన అందుకు సన్నాహాలు చేసుకోవడం మంచిది.