ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని ఓ మొబైల్ ఫోన్ కంపెనీ చెపుతుంటుంది. తెలంగాణా ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ఎవరి జీవితాలు మార్చేయలేకపోయినా తప్పకుండా వేలాదిమంది చేనేత కార్మికులకు చాలా ఊరట నిస్తుంది. ఈసారి బతుకమ్మ పండుగకు రాష్ట్రంలో తెల్లకార్డులు కలిగిన మహిళలకు ఒక్కొక్కరికీ రెండేసి చేనేత చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని కోసం సుమారు 86 లక్షల చీరలు అవసరం ఉంటాయని అంచనా వేసింది. వాటిని నేసి అందించే బాధ్యత రాష్ట్ర చేనేత కార్మికులకే అప్పగించబోతోంది. కనుక అటు పేద మహిళలకు పండుగ పూట రెండు కొత్త చీరలు వస్తాయి. నేతన్నలకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రభుత్వాలు కాస్త మానవతా దృక్పధంతో ఆలోచిస్తే ఎంత మేలు జరుగుతుందో తెలుసుకోవడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.