జస్టిస్ సిఎస్ కర్ణన్ కు జైలు శిక్ష

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో సహా ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఐదేళ్ళ  జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు జరిమాన విదించిన కోల్ కతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిఎస్ కర్ణన్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే స్పందించింది. కోర్టుదిక్కారనేరానికి పాల్పడినందుకు ఆరు నెలలు జైలు శిక్ష విదిస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది.

కోర్టు ధిక్కారానికి పాల్పడిన వ్యక్తి హోదాను బట్టి వేర్వేరుగా తీర్పులు ఇవ్వలేమని. కనుక ఆ నేరానికి పాల్పడిన వారిని ఎవరికైనా శిక్ష తప్పదని జస్టిస్ సిఎస్ కర్ణన్ కూడా ఇందుకు అతీతుడుకారని సుప్రీంకోర్టు తన తాజా ఉత్తర్వులలో పేర్కొంది. కనుక అయన జైలుకు వెళ్ళక తప్పదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయానికి తిరుగులేదు కనుక నేడో రేపో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించవచ్చు.

ఒకసారి జైలుకి వెళ్ళివస్తే ఆయన మళ్ళీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి కాదు గదా..మరే పదవి చేపట్టడానికి అనర్హుడవుతారు కనుక ఇంతటితో ఆయన న్యాయవృత్తిని శాస్వితంగా వదులుకోవలసిరావచ్చు. సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆయన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

ఒక రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సిఎస్ కర్ణన్ వివిధ కేసులలో అనేకమందికి జైలు శిక్షలు విదించి ఉంటారు. కానీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ తో సహా ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు  జైలు శిక్ష విదించినందుకు ఇప్పుడు తనే స్వయంగా జైలుకి వెళ్ళవలసివస్తోంది. ఒక రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టుని ధిక్కరించడం, ఆ కారణంగా జైలుకి వెళ్ళడం దేశచరిత్రలో ఇదే మొదటిసరి.