తెరాస,భాజపాల మద్య రగిలిన మిర్చి మంటలలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా తనవంతు మరో నాలుగు మిరపకాయలు వేసి ఘాటు పెంచినట్లు మాట్లాడారు. ఎప్పుడూ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తెరాస సర్కార్ ను నేరుగా వేలెత్తి చూపి మాట్లాడని దత్తన్న మిర్చి విషయంలో నేరుగా పేరుపెట్టే విమర్శించారు.
ఆయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ప్రోత్సహించిన కారణంగానే ఈసారి చాలా మంది రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి పంటను వేశారు. కానీ అదే పొరపాటని ఇప్పుడు తేలింది. ఒకేసారి అంత బారీగా మిర్చి మార్కెట్లకు తరలిరావడంతో ధరలు పడిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం వెంటనే స్పందించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం క్రింద క్వింటాలుకు రూ.5,000, ఇతర ఖర్చుల కోసం అధనంగా మరో రూ.1,250లు ప్రకటించింది. అది మిర్చి రైతును ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం క్రింద ప్రకటించిన ధరే తప్ప మద్దతు ధర కాదు. రైతులను ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం తన వంతు సహాయసహకారాలు అందిస్తుంది. కానీ ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతుల కోసం రూ.250 కోట్లు ప్రత్యేకనిధిని ఏర్పాటు చేయాలి. ఇదివరకు కేంద్రానికి వచ్చిన ఆదాయంలో 30 శాతం మాత్రమే రాష్ట్రాలకు పంచి ఇచ్చేది. కానీ 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు దానిని 42 శాతానికి పెంచి ఇస్తోంది. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి అధనంగా లభిస్తున్న ఆ 12 శాతం నిధులలో నుంచి మిర్చి రైతులను ఆదుకోవడానికి నిధులు కేటాయించాలి,” అని బండారు దత్తాత్రేయ తెరాస సర్కార్ కు సూచించారు.