జి.హెచ్.ఎం.సి. సోమవారం ఒక సరికొత్త ప్రయోగం చేసింది. మాదాపూర్ లో సున్నం చెరువు సమీపంలో ఒక అనధికార కట్టడానికి ప్రేలుడు పదార్ధాలు అమర్చి ఇంప్లోసన్ పద్దతిలో కూల్చి వేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయోగం విఫలమైంది. ఆ ప్రేలుడు ధాటికి ఆ నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తు మాత్రమే కూలింది. మిగిలిన మూడు అంతస్తులు కొద్దిగా క్రుంగి ఎడమవైపుకు ఒరిగి అలాగే నిలబడ్డాయి. ఆ స్థితిలో ఉన్న భవనం ఇంకా ప్రమాదకరం కనుక ఆ భవనం లోపలకు ఎవరూ ప్రవేశించకుండా బారికేడ్లు కట్టారు.
ఈ భవనం కూల్చివేసే పనిని బ్లాస్టేక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించబడింది. దాని మేనేజింగ్ డైరెక్టర్ వి శ్రీకాంత్ మాట్లాడుతూ, “ఈరోజు మా ప్రయత్నం ఫలించలేదు. మళ్ళీ రేపు ఉదయం మరొకమారు ప్రయత్నించి భవనాన్ని కూల్చి వేస్తాము,” అని మీడియాకు చెప్పారు. ఆ భవనానికి పక్కనే మరొక నిర్మాణంలో ఉన్న భవనం ఉన్నందున దానికి ఎటువంటి నష్టం కలుగకుండా తక్కువ విస్పొటన శక్తి కలిగిన ప్రేలుడు పదార్ధాలను అమర్చడం వలననే భవనం పూర్తిగా కూల్చలేకపోయినట్లు సమాచారం.
డిప్యూటీ మున్సిపల్ కమీషనర్ వి. మమత మీడియాతో మాట్లాడుతూ, “దిల్ షుక్ నగర్ కు చెందిన జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నారు. గతంలో అనేకసార్లు హెచ్చరించినా అయన పట్టించుకోకుండా భవన నిర్మాణం కొనసాగించడంతో, ఇదివరకు ఒకసారి మేము ఒక అంతస్తును కూలద్రోశాము కూడా. కానీ అయన ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మళ్ళీ భవననిర్మాణం కొనసాగిస్తుండటంతో ఇవ్వాళ్ళ ఈ ప్రయోగంతో భవనాన్ని మొత్తం నేలమట్టం చేద్దామని ప్రయత్నించాము. మా ఈ ప్రయత్నం విఫలమైనప్పటికీ దీని ద్వారా అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నవారికి గట్టి హెచ్చరికలే పంపగలిగామని భావిస్తున్నాము,” అని అన్నారు.