వారి ఆశ ఇన్నాళ్ళకు తీరింది

తెలంగాణాలో ఆశా వర్కర్ల (అక్రిడేటడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్) చిరకాలంగా చేస్తున్న పోరాటాలు, ఫలించాయి. ఇంత వరకు నెలకు కేవలం రూ.1,000-1,500 జీతాలకే వెట్టి చాకిరీ చేస్తున్న ఆశా వర్కర్లకు నాలుగు రెట్లు జీతాలు పెంచి ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆశా వర్కర్లు చాలా సంతోషించారు. ఈనెల నుంచే వారికి నెలకు రూ.6,000 చొప్పున జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జూన్ నెల నుంచి వారు పెరిగిన జీతాలు అందుకోబోతున్నారు. 

ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో తనను కలిసేందుకు వచ్చిన ఆశా వర్కర్లను ఉద్దేశ్యించి కేసీఆర్ మాట్లాడుతూ, “ఆశా వర్కర్లు కేవలం రెండు మూడు గంటలు మాత్రమే పని చేయవలసి ఉన్నప్పటికీ వారు రోజంతా తమకు సంబంధం లేని పనులను కూడా చేయవలసి వస్తోంది. కానీ వారికి అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు.  ఒకవిధంగా వారు వెట్టి చాకిరీ చేస్తున్నట్లే భావించవచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వాలు ఏనాడూ వారిని పట్టించుకోలేదు. అంగన్ వాడీ వర్కర్ల పరిస్థితి కూడా అలాగే ఉండేది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారి జీతాలు పెంచాము. ఇప్పుడు మీవి కూడా పెంచుతున్నాము. అందరూ సమాజంలో సుఖంగా, తలెత్తుకొని జీవించాలని మా ప్రభుత్వం కోరుకొంటోంది. అందుకే మీ జీతాలు కూడా పెంచాము. త్వరలో ప్రారంభం కాబోతున్న ‘అమ్మఒడి’ (మాత శిశు సంరక్షణ) పధకాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ పైనే ఉంది,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.