టిటిడిపి నేతలు అలా ఫిక్స్ అయ్యారు

తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తెదేపా ప్రతీ ఏటా మే నెలలో మహానాడు సభలను నిర్వహించుకొంటుంది. ఈసారి అది ఏపిలో అధికారంలో ఉన్నందున మే 27 నుంచి 3 రోజులపాటు విశాఖపట్నంలో నిర్వహించుకోవడానికి సన్నాహాలు చేసుకొంటోంది. తెలంగాణా తెదేపా నేతలు కూడా ఆ సమావేశాలలో పాల్గొనాలని అనుకొన్నారు. కానీ తెలంగాణాలో తమ పార్టీ ఉనికిని బలంగా చాటుకోవాలంటే హైదరాబాద్ లో కూడా మహానాడు సభలు నిర్వహించుకోవడమే మంచిదని నిర్ణయించుకొన్నారు.

తెలంగాణా తెదేపా సీనియర్ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. చంద్రశేఖర్ రావు శుక్రవారం హైదరాబాద్ లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఈనెల 24న తెలంగాణా మహానాడు సభను హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుపుకోవాలని నిర్ణయించాము. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్యం, నిరుద్యోగం మొదలైన సమస్యలపై మేము లోతుగా చర్చించి వాటిపై మా పార్టీ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మహానాడులో 8 తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించాము. హైదరాబాద్ లో జరిగే మహానాడు సభకు, అలాగే  మే27 నుంచి విశాఖలో జరుగబోయే జాతీయ మహానాడు సభలకి హాజరయ్యేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెదేపా శ్రేణులు తరలిరావాలని కోరుతున్నాము. విశాఖ సభలకు హాజరయ్యేవారి కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులను వేస్తున్నాము,” అని చెప్పారు. 

ఏపిలో తెదేపా అధికారంలో ఉంది...పైగా అక్కడ దానికి మంచి పట్టు ఉంది కనుక విశాఖలో మహానాడు నిర్వహించడం దానికి గొప్ప విషయం కాదు. కానీ తెలంగాణాలో గత 13 ఏళ్ళుగా ప్రతిపక్షానికే పరిమితమయిన తెదేపా, హైదరాబాద్ లో మహానాడు నిర్వహించడం చాలా గొప్ప విషయమే అని చెప్పక తప్పదు. హైదరాబాద్ లో జరుగబోయే ఈ సభను తెదేపా నేతలు విజయవంతం చేయగలిగితే మంచిదే కానీ విఫలం అయితే అది వారి రాజకీయ భవిష్యత్ కు గొడ్డలిపెట్టుగా మారవచ్చు. తెలంగాణాలో ఆ పార్టీకి బలం లేదని స్వయంగా చాటి చెప్పుకొన్నట్లు అవుతుంది.