నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈరోజు సుప్రీంకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. సుమారు నాలుగున్నరేళ్ళ క్రితం అంటే 2012 డిసెంబర్ 16వ తేదీ రాత్రి డిల్లీలో ఒక కదులుతున్న బస్సులో ఒక మైనరు, బస్సు డ్రైవరుతో సహా ఆరుగురు వ్యక్తులు 22 ఏళ్ళు వయసున్న మెడికో నిర్భయపై సామూహిక అత్యాచారం చేసి, తరువాత అతి దారుణంగా హింసించి చంపిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఆ కేసులో దోషులుగా పేర్కొనబడిన వారిలో మైనర్ మూడేళ్ళు నిర్బంధంలో ఉండి హాయిగా బయటకు వెళ్ళిపోయాడు. మిగిలిన ఐదుగురిపై సుదీర్గ విచారణ తరువాత 2013లో ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విదించింది. వారిలో రాం సింగ్ అనే వ్యక్తి తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకొన్నాడు.
అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ అనే మిగిలిన నలుగురు దోషులు డిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకోగా అక్కడా వారికి ఉరి శిక్షే ఖరారు అయింది. ఆ తరువాత వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోగా ఆ కేసుని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈరోజు కొద్దిసేపటి క్రితమే వారు నలుగురు దోషులేనని తేల్చి చెప్పి వారికి ఉరిశిక్షనే ఖరారు చేసింది.
నిర్భయ మరణ వాంగ్మూలం, సిసి ఫుటేజి, ఇతర సాక్ష్యాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొన్నజస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దోషులు నలుగురు అత్యంత హేయమైన నేరానికి పాల్పడ్డారని వారికి ఉరి శిక్ష సరైనదని తీర్పు చెప్పారు.
ఈ తీర్పుతో ఈ కేసులో సుదీర్ఘమైన న్యాయపోరాటాలు ముగిసినట్లే. కానీ దోషులు నలుగురు రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పిటిషన్ పెట్టుకోవచ్చు. ఆవిధంగా వారికి మరికొంత కాలం ఆయువు మిగిలి ఉంటుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 25తో ముగియబోతోంది. కనుక ఈలోగానే ఆయన దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఆయన కేంద్రప్రభుత్వం సలహా మేరకే నిర్ణయం తీసుకొంటారు. ఇటువంటి నేరాల పట్ల మోడీ ప్రభుత్వం చాలా కటినంగానే ఉండవచ్చు కనుక వారి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించమని రాష్ట్రపతిని కోరవచ్చు. అదే జరిగితే జూలై 25లోగానే నలుగురికి ఉరి శిక్ష అమలు చేయవచ్చు.