మిర్చి రైతులను తెరాస సర్కార్ మోసం చేసింది: భాజపా

మిర్చి రైతుల సమస్యల తెరాస-భాజపాల మద్య మొదలైన మాటల యుద్ధం గమనిస్తే కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగానే కాదేదీ రాజకీయలకు అనర్హం అనుకోవలసివస్తోంది. మార్కెట్లో క్వింటాలు రూ.6,000 ధర పలికే నాణ్యమైన మిర్చికి కేంద్రప్రభుత్వం రూ.5,000 మద్దతు ధర నిర్ణయించడాన్ని తప్పుపడుతూ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఘాటుగా జవాబిచ్చారు. 

“తెరాస సర్కార్ మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో దారుణంగా విఫలమైంది. మిర్చి రైతులు ఎదుర్కొంటున్న ఈ కష్టాలు నష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మార్కెటింగ్ శాఖా మంత్రి హరీష్ రావే బాధ్యత వహించాలి. గత నెల రోజులుగా మిర్చి రైతులు ఆందోళనలు చేస్తున్నా వారి కోసం తెరాస సర్కార్ ఏమైనా చేసిందా?తెరాస సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదు. వారి కోసం ఏమీ చేయకుండా కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తూ కాలక్షేపం చేసేశారు. మార్కెట్ లో ప్రస్తుతం క్వింటాలుకు మిర్చి రూ.3,000 అంత కంటే తక్కువ ధరలకు పడిపోయిన సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్ కి, హరీష్ రావు లకి తెలియదా? ఆ సంగతి తెలిసీ క్వింటాలుకు రూ.5,000+1250 గిట్టుబాటు ధరను ప్రకటించిన కేంద్రప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. తెరాస నేతలకు ఎంతసేపు రాజకీయాలు చేయడం, ప్రతీ అంశం నుంచి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందాలనే ఆలోచన చేస్తారు తప్ప ప్రజల, రైతుల కష్టాలు వారికి పట్టవు. రైతుల కష్టాలకు, నష్టాలకు వారిరువురే పూర్తి బాధ్యత వహించాలి,” అని అన్నారు డా.కె.లక్ష్మణ్. 

తక్షణమే మార్కెట్ కు వచ్చిన మిర్చిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ వరంగల్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్లకు ఈరోజు వినతి పత్రాలను ఇస్తామని డా.కె.లక్ష్మణ్ చెప్పారు.