కేంద్రంపై హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో మార్కెట్ యార్డుల్లో మిర్చి కొనుగోలు ధరలు పడిపోతున్నందున గత నెల రోజులుగా మిర్చి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ఎట్టకేలకు కేంద్రప్రభుత్వం మొన్న మిర్చికి గిట్టుబాటు ధర ప్రకటించింది. క్వింటాలుకు నాణ్యమైన మిర్చికి రూ.5,000, రవాణా, లోడింగ్, అన్ లోడింగ్ వగైరా ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.1,250 చెల్లించడానికి అంగీకరించింది. అయితే మే2 నుంచి 31 వరకు కేవలం 33,000 టన్నులు మిర్చి మాత్రమే కొనుగోలు చేయడానికి అంగీకరించింది. మళ్ళీ దానిలో కూడా నష్టం వస్తే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పతిలో దానిని భరించాలని చెప్పింది.

దీనిపై రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు చాలా ఘాటుగా స్పందించారు. “మిర్చి రైతుల సమస్యల పట్ల కేంద్రప్రభుత్వానికి అసలు అవగాహన లేదని అర్ధం అవుతోంది. మార్కెట్ లో క్వింటాలుకు రూ.6,000 పలికే నాణ్యమైన తేజ రకం మిర్చికి రూ.5,000 గిట్టుబాటు ధర నిర్ణయించడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో 7 లక్షల టన్నుల మిర్చి పండితే, కేవలం33,000 టన్నులు మిర్చిని మాత్రమే, అది కూడా మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తామని చెప్పడం దాని అవగాహనారాహిత్యానికి మరో ఉదాహరణ.

ఎఫ్.సి.ఐ., నాఫెడ్ సంస్థలు కొనుగోలు చేయవుట. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలిట! కేవలం33,000 టన్నులు మిర్చిని మాత్రమే కొంటే మార్కెట్ కు రోజుకు లక్ష మిగిలిన మిర్చిని ఏమి చేసుకోవాలి? రైతులు ఎవరికి అమ్ముకోవాలి? ఎంతకి అమ్ముకోవాలి? ఈ మాత్రం ధరకు.. ఈ మాత్రం మిర్చిని రాష్ట్ర ప్రభుత్వమె కొనుగోలు చేయలేకనే ఇంతకాలం ఆగామా?” అని ఆవేశంగా ప్రశ్నించారు. 

మిర్చి రైతుల సమస్యలపై భాజపా నేతల హడావుడి చేయడాన్ని కూడా హరీష్ రావు తప్పు పట్టారు. “ఒకవైపు రాష్ట్రంలో భాజపా నేతలు మిర్చి రైతులకు న్యాయం చేయాలని ర్యాలీలు, ధర్నాలు చేస్తుంటారు. మరోపక్క ఎన్డీయే ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వదు. మార్కెట్ కు వస్తున్న లక్షల టన్నుల మిర్చిలో మొక్కుబడిగా 33,000 టన్నులు మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలని చెపుతుంది. భాజపా ద్వంద వైఖరికి ఇది అద్దం పడుతోంది,” అని విమర్శించారు.