అందరం కలిసి పనిచేద్దాం: కేసీఆర్

విద్యుత్ శాఖలో 13,500 ఖాళీలను భర్తీ చేయబోతున్నందుకు, పదోన్నతులు కల్పిస్తునందుకు విద్యుత్ ఉద్యోగులు గురువారం ప్రగతి భవన్ వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత తెలుపుకొన్నారు. కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించి, రాష్ట్రాభివృద్ధిలో వారి సహకారం కోరారు. 

“ఒకప్పుడు తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉండేది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది ఇంకా పెను సమస్యగా మారిపోతుందని కొందరు జోస్యం చెప్పారు. కానీ మీ అందరి సహకారంతో కొన్ని నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చేయగలిగాము. రాష్ట్రం ఏర్పడినప్పుడు మన వద్ద 6,500 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండేది. దానికి అదనంగా మరో 4,500 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తిని జోడించి రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించగలిగాము. రాగల రెండేళ్ళలో మరో 27,000 మెగావాట్స్ విద్యుత్ అందుబాటులోకి వస్తే ఇక మన రాష్ట్రం కూడా మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుంది. ఇప్పటికే మన రైతులకు విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాము. మున్ముందు 24 గంటలు విద్యుత్ అందించాలని నా కోరిక,’ అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

“రాష్ట్రానికి ఎంతో కీలకమైన విద్యుత్ శాఖలో అందరూ రెగ్యులర్ ఉద్యోగులే ఉండాలని నా అభిప్రాయం. అందుకే ఆ శాఖలో 24,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తాము. అదే విధంగా విద్యుత్ శాఖను మరింత బలోపేతం చేసుకొనేందుకు ఇప్పటికే 2,000 మందిని నియమించుకొన్నాము. మళ్ళీ త్వరలో మరో 13,500 ఖాళీలను భర్తీ చేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విద్యుత్ శాఖలో 2-3 వారాలలోనే పదోన్నతుల ప్రక్రియ మొదలుపెట్టాలని నేను అధికారులను ఆదేశించాను. కనుక త్వరలోనే అదీ మొదలవుతుంది,” అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.    

 రాష్ట్ర విద్యుత్ అవసరాల గురించి మాట్లాడుతూ, “రానున్న 2-3 నెలలలో వివిధ ఎత్తిపోతల పధకాలకు సుమారు 10,000 మెగావాట్స్ విద్యుత్ అవసరం ఉంటుంది. అలాగే.. వచ్చే ఏడాది చివరి నుండి పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి ప్రాజెక్టులకు కూడా భారీగా విద్యుత్ అవసరం ఉంటుంది. ఈ ఎత్తిపోతల పధకాలకు విద్యుత్ చార్జీల భారం ప్రభుత్వమే భరిస్తుంది. డానికి బడ్జెట్ లోనే కేటాయింపులు చేస్తాము. రాష్ట్రాభివృద్ధిలో నాకు మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. అందరం కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దాము,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.