అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకె పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నిన్న సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్ వేశారు. ఆ కేసులో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, తను నిర్దోషినని కనుక తనకు జైలు శిక్ష విదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని శశికళ తన పిటిషన్ లో కోరారు. ఆమెతో బాటు అదే జైలులో ఉన్న సుధాకరన్, ఇళవరసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
సుమారు రెండు నెలలు జైలు శిక్ష అనుభవించిన తరువాత వారు అకస్మాత్తుగా రివ్యూ పిటిషన్ వేయడం ఆశ్చర్యకరమే. ఇది కూడా తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలలో భాగంగానే జరిగిందా లేక యాద్రుచ్చికమా? అనేది మున్ముందు తెలియవచ్చు. ఎందుకంటే, ఇటీవల డిల్లీ పోలీసులు శశికళ మేనల్లుడు దివాకరన్ ను అరెస్ట్ చేసిన తరువాత పళని స్వామి ప్రభుత్వంలోని కొందరు మంత్రులకు నోటీసులు పంపబోతున్నట్లు మీడియాలో వార్తలు రావడం, బహుశః ఆకారణంగానే పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గం మద్య జరుగుతున్న చర్చలలో అకస్మాత్తుగా స్తబ్దత ఏర్పడటం వంటివి చూస్తుంటే తమిళనాడులో మరో సరికొత్త రాజకీయ డ్రామాకు రంగం సిద్దం అవుతోందా?అనే అనుమానం కలుగుతోంది.