పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మొన్న గాంధీ భవన్ లో విలేఖరులతో మాట్లాడుతూ "ఉత్తరాదిన భాజపా అధికారంలోకి వచ్చేస్తోంది కనుక తెలంగాణాలో కూడా వచ్చేయగలమని పగటి కలలు కంటున్నారు. రాష్ట్ర భాజపా నేతలు హిందూ ఓట్లతో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేయవచ్చనే ఒక రకమైన భ్రాంతి, భ్రమలో జీవిస్తున్నారు. కానీ రాష్ట్రంలో హిందూ, ముస్లింలు చాలా సఖ్యతగా జీవిస్తున్నారు. వారు భాజపాకు ఓటేస్తారనుకోలేము. పైగా రాష్ట్రంలో భాజపాకు బలం లేదు కూడా. దక్షిణాది రాష్ట్రాలలో భాజపా ఎన్నటికీ అధికారంలోకి రాలేదు," అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పకపోవడం వారిని అగౌరవపరిచినట్లేనని ఉత్తం కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.