మిర్చి సమస్య ప్రభుత్వాల వైఫల్యమే!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో మిర్చి రైతులను ఆదుకోవడంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. రెండు ప్రభుత్వాలు విదేశీ కంపెనీలపై చూపించే శ్రద్ద మనకు అన్నం పెట్టే రైతులపై చూపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకపోవడం వలననే రైతులు రోడ్లెక్కక తప్పనిసరి పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇది వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖల వైఫల్యమేనని అన్నారు. రైతులకు మార్గదర్శనం చేయడంలో వ్యవసాయశాఖ విఫలం అయితే, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో మార్కెటింగ్ శాఖ విఫలం అయ్యిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆరుగాలం శ్రమించి మనకి అన్నం పెట్టే రైతన్న కంట కన్నీళ్ళు పెడితే దేశానికి మంచిది కాదని కనుక ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతుల సమస్యలను మానవతా దృక్పధంతో పరిష్కరించాలని పవన్ హితవు పలికారు. మార్కెట్లో ధరలకు, గిట్టుబాటు ధరకు మద్య చాలా వ్యత్యాసం ఉందని దానిని రెండు ప్రభుత్వాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మిర్చికి క్వింటాలుకు రూ.11,000 చొప్పున గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.