దిగ్విజయ్ సింగ్ పై చర్యలు తప్పవు

దిగ్విజయ్ సింగ్ పై తెరాస నేతల ఎదురుదాడి మొదలైంది. తెరాస నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా దీనిపై దిగ్విజయ్ సింగ్ నే తప్పు పడుతున్నారు.

తెలంగాణా పోలీసుల పనితీరుని అందరూ ప్రశంసిస్తుంటే, దిగ్విజయ్ సింగ్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. దిగ్విజయ్ సింగ్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. 

మాజీ పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత తెరాస నేత డి.శ్రీనివాస్ మాట్లాడుతూ  “దిగ్విజయ్ సింగ్ తక్షణం తన ఆరోపణలకు ఆధారాలు చూపాలి లేకుంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఈవిధంగా మాట్లాడి పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం సబబు కాదు. ఆయన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి శాస్వితంగా తాళాలు వేసిన ఘనుడు. ఈవిధంగా మాట్లాడితే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీకి తాళం పడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ కలుపుకుపోతూ సెక్యులర్ విధానంలో సాగిపోతుంటే దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు ప్రజల మద్య చిచ్చుపెట్టేవిగా ఉన్నాయి. ఆయన ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించాలి,” అని అన్నారు. 

దిగ్విజయ్ సింగ్ పై జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఇప్పటికే పోలీసులకు పిర్యాదు చేశారు. తెరాస సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వారు రంగంలో దిగవచ్చు.

భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఈ ఆరోపణలపై స్పందిస్తూ, “దిగ్విజయ్ సింగ్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారా లేక ఐసిస్ ఉగ్రవాదులకు సానుభూతిగా మాట్లాడుతున్నారా? తెలంగాణా పోలీస్ శాఖపై అయన చేసిన ఆరోపణలు అర్ధరహితం. ఆయనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పందించాలి,” అని అన్నారు.