పాక్ వక్రబుద్ధి ఎన్నడూ మారదని ఈరోజు మరొకసారి నిరూపించుకొంది. ఈరోజు ఉదయం పూంచ్ సెక్టార్ లో కృష్ణ ఘాటి అనే ప్రాంతంలో భారత్ అవుట్ పోస్టులపై పాక్ సైనికులు మోర్టార్లు, బాంబుల వర్షం కురిపించడంతో ఇద్దరు భారత్ జవాన్లు మరణించారు. దాడి అనంతరం పాకిస్తాన్ కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్స్ (బ్యాట్స్) నియంత్రణరేఖను దాటి భారత్ భూభాగంలో సుమారు 250 మీటర్లు లోపలకి ప్రవేశించి అక్కడ చనిపోయున్న ఇద్దరు జవాన్ల శరీరాలను చిద్రం చేసి వెనక్కు తిరిగివెళ్ళిపోయారు. గతంలో కూడా పాక్ సైనికులు ఒకసారి భారత్ భూభాగంలోకి ప్రవేశించి ఒక భారతీయ జవాను తలను నరికి తీసుకువెళ్ళిపోయారు. తమ సహచరులపట్ల పాక్ సైనికులు చేసిన ఈ దుశ్చర్యపట్ల భారత సరిహద్దు జవాన్లు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. పాక్ సైనికుల ఈ దుశ్చర్యకు తప్పకుండా ధీటుగా ప్రతిచర్యలు ఉంటాయని భారత్ హెచ్చరించింది.
గత ఏడాది సెప్టెంబర్ లో భారత్ సైనికులు పాక్ అధీనంలో ఉన్న కాశ్మీర్ లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అక్కడ పొంచి ఉన్న ఉగ్రవాదులను, వారి శిభిరాలను ద్వంసం చేశారు. కానీ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినట్లు అంగీకరించలేకపోయిన పాక్ అప్పటి నుంచి భారత్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు వేచి చూస్తూనే ఉంది. ఈరోజు జరిగిన ఈ దాడి బహుశః అదే అయ్యుండవచ్చు. దీనిపై భారత్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.