చంద్రబాబు..చిన్నబాబు మద్య కమ్యూనికేషన్ గ్యాప్?

రెండు మూడు రోజుల క్రితం ఏపి ఐటి మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ “ముందస్తు ఎన్నికలు వస్తాయని నాన్నగారు (ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు) ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ వస్తే వాటిని ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని మాత్రమే చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాము. ఈ మూడేళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారు కనుక  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాటిలో మేమే తప్పకుండా గెలుస్తాము. 

దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుపడం ఎలా సాధ్యం? ఏడాది ముందే ఎన్నికలు నిర్వహిస్తామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు. 6 నెలల ముందయితే ఒప్పుకొనే అవకాశం ఉంటుంది. కనుక దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుపడం సాధ్యం కాదు. అలాగే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేదని నేను భావిస్తున్నాను,” అని నారా లోకేష్ అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఎప్పుడూ ఎక్కడో అక్కడ ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీ 3-4 నెలలకు ఏవో ఒక ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. వాటివలన ప్రభుత్వాలకు పరిపాలన, అభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం సాధ్యంకావడం లేదు. ఎంతసేపు ఆ ఎన్నికల గురించే ఆలోచించవలసి వస్తోంది. కనుక దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాలలో  ‘అన్ని ఎన్నికలు’ జరపాలనుకోవడం చాల మంచి నిర్ణయమే. దానికి మా పార్టీ, ప్రభుత్వం రెండూ మద్దతు ఇస్తాయి,” అని అన్నారు. 

చంద్రబాబు, లోకేష్ తండ్రీకొడుకులు..ఒకే ప్రభుత్వంలో మంత్రులు.. ఒకే పార్టీలో సభ్యులుగా ఉన్నప్పటికీ ఒకే అంశంపై ఇద్దరూ వేర్వేరుగా మాట్లాడటం గమనిస్తే వారి మద్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు అర్ధం అవుతోంది. కానీ ఇద్దరి అభిప్రాయలు తప్పనిసరిగా ఒకేలాగా ఉండాలనే నియమం ఏదీ లేదు కనుక నారా లోకేష్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగత అభిప్రాయంగానే భావించవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలే తెదేపా, ఏపి ప్రభుత్వ అభిప్రాయంగా భావించవలసి ఉంటుంది కనుక ఆయన ముందస్తు ఎన్నికలకు, దేశంలో ఒకేసారి ఎన్నికలకు సిద్దంగానే ఉన్నట్లు భావించవచ్చు.