అవినీతిలో నెంబర్: 1 రాష్ట్రం ఏదంటే..

సి.ఎం.ఎస్-ఇండియన్ కరెప్షన్ స్టడీ సంస్థ దేశవ్యాప్తంగా జరిపిన 2017-సర్వే ఫలితాలను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ బిబేక్ దేబ్ రాయ్ నిన్న డిల్లీలో విడుదల చేశారు. దాని ప్రకారం అవినీతిలో నెంబర్: 1 రాష్ట్రంగా కర్నాటక (77%) నిలబడగా దాని తరువాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ (74%), తమిళనాడు (68%), మహారాష్ట్ర (57%), జమ్మూ కాశ్మీర్(44), పంజాబ్(42)లో నిలిచినట్లు పేర్కొంది.

 ఇక దేశంలో తక్కువ లంచగొండితనం కలిగిన రాష్ట్రాలలో ఛత్తీస్ గఢ్‌(13%), కేరళ (4%) హిమాచల్ ప్రదేశ్ (3%) స్థానంలో నిలవడం విశేషం. 

సి.ఎం.ఎస్-ఇండియన్ కరెప్షన్ స్టడీ నివేదికలో తెలంగాణాతో సహా అనేక రాష్ట్రాలను పేర్కొనకపోవడం వలన ఆయా రాష్ట్రాలలో అవినీతి స్థాయి గురించి అధికారిక సమాచారం లేకుండా పోయింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితం శాసనసభలో మాట్లాడుతూ “అభివృధిలో అయినా.. అవినీతిలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉంటుంది,” అని నోరు జారారు. ఆయన చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లంచగొండితనంలో నెంబర్: 1 స్థానం దక్కకపోయినా రెండవ స్థానం దక్కింది.