వరంగల్ తెరాస సభ హైలైట్స్

వరంగల్ నగరంలో ఈరోజు జరుగుతున్న తెరాస ప్రగతి నివేదన సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. సభకు వచ్చేందుకు బయలుదేరిన వాహనాలతో వరంగల్ కు వెళ్ళే దారులన్నీ ట్రాఫిక్ జామ్ అవడంతో అనేక వందల వాహనాలను వెనక్కి తిప్పి పంపవలసి వచ్చింది. మంత్రులు కేటిఆర్, జగదీశ్ రెడ్డి   ఈ ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో వారు సభకు హాజరు కాలేకపోయారు. 

ఇంకా అనేకమంది ముఖ్యులు రావలసి ఉండటంతో సాయంత్రం 6గంటలకు మోదలవవలసిన సభ 7.20 గంటలకు మొదలైంది. అంతవరకు రసమయి తదితరులు తమ పాటలు, నృత్యాలతో ప్రజలను అలరించారు. ఇదివరకు తెలంగాణా కోసం పాటలు కట్టి పాడిన రసమయి బాలకిషన్ ఇప్పుడు కేసీఆర్ ని పొగుడుతూ పాటలు పాడటం విశేషం. 

ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ అభివాదం చేసిన తరువాత "పూలబొకేలు అందించుకొంటే సభ ఆలస్యం అవుతుంది కనుక వాటి సంగతి తరువాత చూసుకొందామని" చెప్పి సభను ప్రారంభించేశారు. 

తెరాస శ్రేణులు కాల్చుతున్న టపాసుల మోతతో సభకు ఆటంకం కలుగుతోందని కనుక టపాసులు కాల్చడం బంద్ చేయించమని కేసీఆర్ సూచించారు.    

కేసీఆర్ స్వయంగా వక్తల పేర్లు చెప్పడం..వారు వెళ్ళి మాట్లాడటం విశేషం. కేసీఆర్ సూచించినట్లు మొదట తెరాస సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు, తరువాత వరుసగా ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహబూబ్ అలీ మాట్లాడారు. కానీ వారి ముగ్గురు ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. 

కేశవరావు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా కొందరు టపాసులు కాల్చుతుండటంతో తెరాస నేత ఒకరు పదేపదే అయన చేతిలో నుంచి మైకు తీసుకొని టపాసులు కాల్చవద్దని కోరుతుండటంతో ఆయన ప్రసంగానికి చాలాసార్లు  అంతరాయం కలిగింది. 

మాజీ కాంగ్రెస్ నేత కేశవరావు చేతే సభను మొదలుపెట్టించిన కేసీఆర్, తన ప్రసంగంలో కాంగ్రెస్ నేతలు సన్నాసులు, దద్దమ్మలు, అవినీతిపరులు, అసమర్ధులు అని కేసిఆర్ తిడుతున్నప్పుడు వేదికమీద, క్రింద ఉన్న మాజీ కాంగ్రెస్, ప్రస్తుత తెరాస నేతలు ఇబ్బందిపడే ఉంటారు.  

వారి తరువాత ప్రసంగించిన కెసిఆర్ తను పార్టీ పెట్టినప్పుడు ఎదురైనా చేదు అనుభవాలు, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. 

ఆంధ్రా పాలకులు రాష్ట్రాన్ని దోచుకొంటూ తెలంగాణాకు పైసా ఇవ్వమని చెప్పిన కాంగ్రెస్ నేతలు సిగ్గుఎగ్గు లేకుండా పదవులలో కొనసాగారని, వారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణాకు న్యాయం చేయలేదు.. ప్రతిపక్షంలోకి మారినా తెలంగాణా అభివృద్ధికి అడుగడుగునా అడ్డు పడుతున్న కాంగ్రెస్ నేతలను ప్రజలే నిలదీయాలని కోరారు.

ఒకరు (సిపిఐ నారాయణ) తెరాస గెలిస్తే చెవి కోసు కొంటానని అంటారు. మరొకరు (ఉత్తం కుమార్ రెడ్డి) కాంగ్రెస్ గెలిచేవరకు గెడ్డం గీసుకొన్ని శపధాలు చేస్తారు. కానీ ప్రతీ ఎన్నికలలో ప్రజలు తెరాసనే గెలిపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా తప్పకుండా తెరాసనే గెలిపించడం ఖాయం. కనుక అప్పుడు ఎవరు ఏమి కోసుకొంటారో అప్పుడు చూద్దాం అని కేసీఆర్ అన్నారు. 

తెరాస పార్టీని, తెరాస సర్కార్ ను ఆదరిస్తున్న ప్రజలందరికీ కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ సభను విజయవంతం చేసినవారందరికీ కృతజ్ఞతలు తెలిపి కేసీఆర్ తన ప్రసంగం ముగించారు.