పార్టీ మారడంపై హరీష్ రావు స్పందన

మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ ఇటీవల మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరరు,” అని చెప్పిన సమాధానంపై మీడియాలో చాలా చర్చే జరిగింది.

“హరీష్ రావుకు కేటిఆర్ కు విభేదాలు మొదలయ్యాయి.. తెరాసలో ముసలం పుట్టింది..హరీష్ రావు వస్తామంటే కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తాము..” అంటూ టీ-కాంగ్రెస్ నేతలు మాట్లాడి ఆ ఊహాగానాలను మరింత రక్తి కట్టించారు. హరీష్ రావు తమ పార్టీలో చేరారని వారికీ తెలుసు కానీ ఆవిధంగా మాట్లాడి తెరాసలో ముఖ్యనేతల మద్య చిచ్చు రగిలించుదామని ప్రయత్నించారు కానీ ఫలితం కనబడలేదు. 

తన గురించి  కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందిస్తూ, “వచ్చే ఎన్నికలలో మా పార్టీని ఎదుర్కోలేమనే భయంతోనే వారు ఆవిధంగా పుకార్లు పుట్టిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పక గెలుస్తుందనే నమ్మకమే వారికుంటే ఇటువంటి చవకబారు రాజకీయాలు చేయడం దేనికి? నేను ఎప్పటికీ తెరాసలోనే ఉంటాను. వారు మా మద్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశ్యం చేస్తున్న ఈ దుష్ప్రచారం వారిలో గూడుకట్టుకొన్న అభద్రతాభావాన్ని చాటి చెపుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు. మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అందరం సైనికుల్లాగా పనిచేస్తాము. వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెరాసయే విజయం సాధించడం ఖాయం,” అని అన్నారు.