డిల్లీ కూడా భాజపాదే!

డిల్లీ మున్సిపల్ ఎన్నికలలో భాజపా ఘనవిజయం సాధించే దిశలో దూసుకుపోతోంది. ఈరోజు ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచే భాజపా ఆధిక్యత కనబరచింది. ఉత్తర, దక్షిణ, తూర్పు డిల్లీ కార్పోరేషన్లలో మొత్తం 272 స్థానాలు ఉండగా వాటిలో 270 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో భాజపా 134 స్థానాలు దక్కించుకొని మరో 51 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. అంటే 270 స్థానాలలో కనీసం 185 స్థానాలు దక్కించుకోవడం ఖాయం అని నిర్ధారణ అయిపోయింది. కనుక డిల్లీ మూడు మున్సిపల్ కార్పోరేషన్ లను భాజపా కైవసం చేసుకోవడం ఖాయం. 

రెండేళ్ళ క్రితం జరిగిన డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమాద్మీ చేతిలో ఘోర పరాభవం పొందిన భాజపా, ఇప్పుడు ఈ విజయంతో దానికి అంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకొన్నట్లయింది. 2015లో జరిగిన డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో 70కి ఏకంగా 67 స్థానాలను గెలుచుకొన్న ఆమాద్మీ పార్టీ ఈ ఎన్నికలలో రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యధాప్రకారం 3వ స్థానంలో సాగుతోంది. 

తాజా సమాచారం ప్రకారం: 

ఉత్తర డిల్లీలో మొత్తం 104 స్థానాలలో భాజపా:62 , కాంగ్రెస్:16, ఆమాద్మీ పార్టీ: 18,ఇతరులు: 01 విజయం సాధించాయి.

దక్షిణ డిల్లీలో మొత్తం 104 స్థానాలలో భాజపా: 68, కాంగ్రెస్:11, ఆమాద్మీ:19, ఇతరులు: 06 విజయం సాధించాయి.

 తూర్పు డిల్లీలో మొత్తం 64 స్థానాలలో భాజపా: 44, కాంగ్రెస్ : 08, ఆమాద్మీ: 08, ఇతరులు:03 విజయం సాధించాయి.

కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాద్యత వహిస్తూ ఆ పార్టీ డిల్లీ అధ్యక్షుడు అజయ్ మఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమాద్మీ పార్టీ ఓటమిపై ఆ పార్టీ నేత అశుతోష్ స్పందిస్తూ “ఇది మోడీ ప్రభంజనం కాదు. ఈవీఎం ప్రభంజనమే. యూపిలో గెలిచినట్లే ఇక్కడ కూడా ఈవిఎంలను ట్యాంపరింగ్ చేసి భాజపా గెలిచింది. అదే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించి ఉండి ఉంటే ఆమాద్మీ పార్టీ సత్తా ఏమిటో భాజపాకు తెలిసివచ్చేది,” అని అన్నారు.