మంగళవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో రైతుహిత సదస్సు జరిగింది. దానిలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఉద్దేశ్యించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, “వచ్చే ఏడాది మే నెల నుంచి రాష్ట్రంలో రైతులు అందరికీ రెండు పంటలకు ఎరువులు కొనుగోలు చేసేందుకు రూ.8,000 ఇవ్వాలని నిర్ణయించాము. కనుక ఆ పధకాన్ని సమర్ధంగా అమలుచేయడానికి వ్యవసాయశాఖలో 500 మంది అధికారులను నియమిస్తాము. వారందరికీ ల్యాప్ టాపులు అందజేస్తాము. ఒక్కో అధికారి 5,000 ఎకరాలలో పంటలను పర్యవేక్షించవలసి ఉంటుంది. గ్రామాలలో రైతు సంఘాల ఏర్పాటులో వారు ముఖ్యపాత్ర పోషించి, మద్యలో దళారులు, అవినీతిపరులు, నకిలీ రైతులు జొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయం ద్వారా బారీ స్థాయిలో ఉపాధి దొరుకుతోంది కనుక దానిని అన్ని విధాల ప్రోత్సహించాలని కృత నిశ్చయంతో ఉన్నాము. దీనికి మీరు అందరి సహకారం కావాలి,” అని అన్నారు.
తరువాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “నాకు వేరే కోరికలేమీ లేవు. రాష్ట్రం పంటలతో పచ్చగా కళకళలాడుతుంటే చూడాలనేదే నా కోరిక. అందుకే రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకొంటున్నాను. కానీ మా ప్రభుత్వం తీసుకొనే ప్రతీ నిర్ణయాన్ని తప్పు పట్టడం, ఎన్నికలతో ముడిపెట్టి చిల్లర రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు ఒక దురలవాటుగా మారిపోయింది. వారి విమర్శలను పట్టించుకొంటే ప్రభుత్వం నడపడం సాధ్యం కాదు. నేను నా వ్యవసాయక్షేత్రం ద్వారా ఏవిధంగా లాభాలు అర్జిస్తున్నానో రాష్ట్రంలో రైతులు అందరూ కూడా ఆవిధంగా లాభాలు ఆర్జించే స్థాయికి ఎదగాలని నేను కోరుకొంటున్నాను,” అని కేసీఆర్ అన్నారు.