రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ పదవీ కాలం వచ్చే నెల 2తో ముగియబోతోంది. జనవరి 2010లో ఆయన సమైక్య రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపిఏ ప్రభుత్వం 2012 మే 3న మరో ఐదేళ్ళ పాటు పదవీకాలం పొడిగించింది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించవలసిన అవసరం ఉన్నప్పటికీ, విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మద్య ఆస్తుల పంపకాలు, ఇతర వ్యవహారాలన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలిసి ఉండటం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు కలిగి ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం వంటి అనేక కారణాల చేత ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా ఆయనను మార్చే ప్రయత్నం చేయకుండా నేటి వరకు ఆయననే గవర్నర్ కొనసాగించింది. వరుసగా రెండు విభిన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, పరస్పరం కలహించుకొంటున్న రెండు రాష్ట్రాలతో ఏడేళ్ళు నొప్పించక తానొవ్వక అన్నట్లుగా పని చేసిన ఘనత గవర్నర్ నరసింహన్ కే దక్కుతుంది.
ఆయనతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి, ముఖ్యమంత్రులకి ఎటువంటి సమస్యలు లేవు. అలాగే ఆయనకు కూడా కేంద్రంతో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలే ఉన్నాయి. పైగా ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించవలసి ఉంది. కనుక మళ్ళీ ఆయన పదవీ కాలం పొడిగించవచ్చని సమాచారం.
నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు మొన్న ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు గనుక వారు ఈ విషయంపై చర్చించే ఉంటారు. కనుక గవర్నర్ నరసింహన్ పదవీ కాలం పొడిగించాలా లేక రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలా? అనే విషయంపై ప్రధాని మోడీ నిర్ణయం తీసుకొనే ఉంటారు. గవర్నర్ నరసింహన్ పదవీ కాలం ముగియడానికి ఇంకా కేవలం వారం రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది కనుక నేడో రేపో దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన చేయవచ్చు.