తెలంగాణాలో తెదేపాకు ఆ సత్తా లేదా?

తెదేపా వ్యవస్థాపకుడు సర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెదేపా ప్రతీ ఏటా మే నెలలో మహానాడు సభలు  నిర్వహిస్తుంటుంది. ఈసారి మహానాడు సభలను మే27 నుంచి మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మహానాడు సభల ఏర్పాట్ల బాధ్యతను మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడుకి అప్పగించారు. తెలంగాణా తెదేపా నేతలు కూడా ఈ మహానాడు సభలలో పాల్గొంటారు.

ఆంధ్రాలో తెదేపా అధికారంలో ఉంది. అక్కడ దానికి మంచి పట్టు కూడా ఉంది కనుక విశాఖలో మహానాడు నిర్వహించడంలో సహజమే. కానీ వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తెదేపాయే తప్పకుండా అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి తదితరులు పదేపదే చెపుతున్నప్పుడు, వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కడైనా మహానాడు విజయవంతంగా నిర్వహించి తమ పార్టీ బలం నిరూపించుకొని ఉంటే బాగుండేది. కానీ వారు విశాఖలో జరిగే మహానాడు సభలతో సరిపెట్టుకోదలిస్తే దానర్ధం ఏమిటి?