అధికార ప్రతిపక్ష రాజకీయ
నాయకులకు, ప్రజలకు మద్య నలిగిపోయేవారు ఎవరంటే జిల్లా కలెక్టర్లేనని చెప్పవచ్చు. అటు
నేతల నుంచి ఒత్తిళ్ళు, ఇటు సామాన్య ప్రజల సమస్యల చిట్టాలు. ఎంత చేస్తున్నా అటు
నేతలు మంత్రుల నుంచి అక్షింతలు, ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు. వీటికి
అధనంగా నిరంతరం సమావేశాలు..ఫలితాలు..నివేదికలు..వాటి కోసం నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటనలు..ఉరుకుల
పరుగుల జీవితాలు గడుపుతుంటారు. ఇంత తీవ్రమైన పని భారం, ఒత్తిళ్ళు ఎదుర్కొనే ఉద్యోగం
మరొకటి ఉండదేమో అనిపిస్తుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి కూడా ఇందుకు అతీతులు కారు. ఈ పనులతో పగలంతా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ప్రజల కోసం తాము చేస్తున్న పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయా లేదా? జిల్లాలో తాము చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా? రోడ్లు, మురుగు కాలువలు, మంచి నీరు సరఫరా, విద్యుత్ దీపాలు, ప్రాధమిక వైద్యం వంటి మౌలికవసతుల పరిస్థితి ఏవిధంగా ఉంది? అనే వివరాలు కావాలనుకొంటే ఆయన తన క్రింద పనిచేసే ఉద్యోగుల ద్వారా గణాంకాలతో సహా తెప్పించుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి, సంబంధిత ప్రజలతోనే నేరుగా మాట్లాడి తెలుసుకొంటే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయనే ఉద్దేశ్యంతో ఆయన ఆదివారం రాత్రి 10 గంటలకు తన మోటార్ సైకిల్ మీద భూపాలపల్లి పట్టణంలో పలు ప్రాంతాలలో పర్యటించారు.
పట్టణంలో సుబాష్ కాలనీ, ఖాసిం పల్లి, హనుమాన్ నగర్, కారల్ మార్క్స్ కాలనీ, ఎస్సీ
కాలనీ, అంబేద్కర్ చౌరస్తా తదితర ప్రాంతాలలో సుమారు 4.30 గంటల పాటు కలెక్టర్ మురళి
పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఆయా
ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, నాణ్యతను స్వయంగా పరిశీలించారు. జిల్లా
కలెక్టర్ మంది మార్బలం వెంట లేకుండా మోటార్ బైక్ మీద వీధివీధి తిరుగుతూ తమతో
నేరుగా మాట్లాడి తమ సమస్యల గురించి అడిగి తెలుసుకొనందుకు స్థానిక ప్రజలు చాల
సంతోషం వ్యక్తం చేశారు.