హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను నగర శివార్లలో గల దుండిగల్, బోడుప్పల్, జవహర్ నగర్, శంషాబాద్ ప్రాంతాలకు తరలించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. ధర్నా చౌక్ ని తరలించాలనే తెరాస సర్కార్ నిర్ణయం దానితో పోరాడేందుకు ప్రతిపక్షాలకు మంచి ఆయుధం అందించినట్లయింది. పైగా తెరాస సర్కార్ ప్రజల గొంతు వినిపించకుండా చేస్తోందని, ప్రజా సమస్యలను వినదలచుకోవడం లేదని బలంగా వాదించేందుకు ప్రతిపక్షాలకు మంచి అవకాశం కల్పించినట్లయింది. దీని పర్యవసానాలు ఏవిధంగా ఉండబోతున్నప్పటికీ ప్రతిపక్షాలు ఎంత ఒత్తిడి చేసినప్పటికీ ఈ విషయంలో వెనక్కు తగ్గకూడదని తెరాస సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
అందుకు బలమైన కారణమే కనిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై వేసిన ఒక పిటిషన్ హైకోర్టులో ఉంది. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ కొనసాగించడం వలన ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. అది ప్రజాహితం కోసం తీసుకొన్న నిర్ణయమే కనుక కోర్టు కూడా తమ నిర్ణయాన్ని సమర్దిస్తుందనే నమ్మకం తెరాస సర్కార్ ఉంది. కనుకనే దీనిపై వెనక్కు తగ్గ కూడదని భావిస్తోంది. ఒకవేళ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే అప్పుడు ఎలాగూ ఉపసంహరించుకోక తప్పదు. కనుక అంతవరకు ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయడానికి అనుమతించకపోవచ్చు. అందుకే దీనిపై తెరాస సర్కార్ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు కూడా.